నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్‌ అగ్నిప్రమాద ఘటన - కీలక పత్రాలు, కంప్యూటర్లు దగ్ధం..!

నాంపల్లిలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో కీలక కేసులకు సంబంధించిన ఫైల్స్ దగ్దమైనట్లు తెలుస్తోంది.

Published on: Feb 7, 2026, 18:05:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ లోని నాంపల్లిలో ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దట్టమైన పొగ అలుముకోవటంతో అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మూడు నాలుగు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం
నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్నిప్రమాదం

భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సీజ్డ్ ప్రాపర్టీ విభాగంలో మంటలు రావటంతో… కీలకమైన కేసులకు సంబంధించిన ఫైల్స్ దగ్దమైనట్లు తెలుస్తోంది. పలు కేసుల్లో సీజ్‌ చేసిన పలు కంప్యూటర్లు కూడా కాలిపోయాయి.

ఉదయం 10 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ సమయంలో నలుగురు ఉద్యోగులు మాత్రమే ఉండగా… వెంటనే బయటికి వచ్చారు. ఆఫీస్ బాయ్ మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. పొగ పీల్చడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. మిగిలిన సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ… కంప్యూటర్లు, హార్డ్ డిస్కులు మంటల దాటికి ఆహుతయ్యాయి. ఇందులో కొన్ని కీలకమైన కేసుల సమాచారం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తుండగా… పూర్తిస్థాయి విచారణ తర్వాత వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ…. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని గుర్తించినట్టు తెలిపారు. ఇది చాలా పాత భవనం అన్నారు. చివరి గదిలో ఉన్న స్విచ్ బోర్డ్ వద్ద షార్ట్ సర్య్కూట్ అయినట్లు పేర్కొన్నారు. ఆ ప్లేస్ నుంచే మంటలు ఒక్కసారిగా వ్యాప్తి చెందాయన్నారు. పూర్తిస్థాయి దర్యాప్తు తర్వాత అన్ని విషయాలు తెలుస్తాయన్నారు.

హైదరాబాద్ లోని అన్ని ప్రభుత్వ భవనాలను తనిఖీ చేస్తామని ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ స్పష్టం చేశారు. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని… కాబట్టి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇక ఈ ప్రమాదంపై సెంట్రల్‌ జోన్‌ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. ల్యాబ్ లోని ఏ ఫైల్స్‌ తగలబడ్డాయో ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు.

కేటీఆర్ ట్వీట్…

ఈ ప్రమాదంపై ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఇదంతా కూడా అనుమానాలకు తావిస్తుందన్నారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్‌లను, ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం పుట్టించిన తప్పుడు ఆధారాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నంగా అనుమానిస్తున్నట్లు తన పోస్టులో రాసుకొచ్చారు.

ఉన్నత స్థాయి విచారణ జరగాలి - ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ఈ ప్రమాదంపై బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఉన్నతస్థాయి విచారణ జరగాలన్నారు.

“పోలీసు శాఖ అత్యంత కీలకమైన, గట్టి భద్రత ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ లో అగ్ని ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తున్నది. అనేక సున్నితమైన కేసులకు సంబంధించిన ఆధారాలు(2015 నాటి ఓటుకు నోటు కేసుతో సహా )ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటి? దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరగాలి. ఆధారాల నిర్మూలనకు ప్రస్తుత పాలకులు ఎంతకైనా తెగిస్తారు. అమెరికాలో ఎంతో మంది చిన్నారులను అపర కుబేరులకు అర్పించిన లైంగిక నేరస్తుడు Epstein జైలులో అనుమానాస్పదంగా చనిపోయాడు” అని ట్వీట్ చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More