మద్యం పర్మిట్ రూమ్‌లో మర్డర్.. వెంటాడి చంపిన చిన్ననాటి స్నేహితుడు

హైదరాబాద్‌లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నాగోల్‌లో చిన్ననాటి స్నేహితుడిని ఓ వ్యక్తి కిరాతకంగా చంపాడు.

Published on: Sep 15, 2026, 15:47:27 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన జరిగింది. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ ప్రాంతంలో సోమవారం రాత్రి జరిగిన రౌడీషీటర్ దారుణ హత్య నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. అందరూ చూస్తుండగానే ఓ ముఠా వెంటాడి వేటకొడవళ్ళు, రాడ్లతో దాడి చేసి ఓ వ్యక్తిని చంపిన ఘటన కలకలం రేపింది. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో, ప్రత్యక్ష సాక్షుల ఫోన్లలో రికార్డై సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నగరంలో భయానక వాతావరణం నెలకొంది.

నాగోల్ హత్య
నాగోల్ హత్య

పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన మహమ్మద్ నహీమ్, ఉమామహేశ్వర్ అలియాస్ జేకే మహేష్ ఇద్దరూ చిన్ననాటి మిత్రులు. అయితే కాలక్రమేణా వీరిద్దరూ నేర ప్రవృత్తికి అలవాటుపడి రౌడీషీటర్లుగా మారారు. వీరిద్దరిపై ఇప్పటికే పలు హత్య, హత్యాయత్నం కేసులు నమోదు కాగా, ఇల్లెందు పోలీస్ స్టేషన్‌లో రౌడీషీట్లు కూడా ఉన్నాయి.

ఇటీవల నహీమ్ బండ్లగూడలోని సహభావన అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నాడు. రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్ల ద్వారా వచ్చిన భారీ మొత్తంలో డబ్బుల పంపిణీ విషయంలో గత మూడు నెలలుగా నహీమ్, మహేష్‌ల మధ్య తీవ్ర విభేదాలు నడుస్తున్నాయి. ఈ ఆర్థిక తగాదాలు ముదిరి చివరికి ఒకరినొకరు మట్టుబెట్టుకునే స్థాయికి చేరాయి.

నహీమ్‌ను హతమార్చేందుకు పథకం పన్నిన మహేష్ గ్యాంగ్ అతని కదలికలపై నిఘా ఉంచింది. సోమవారం రాత్రి దాదాపు 9 గంటల సమయంలో నాగోల్ బండ్లగూడ ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలోని ఒక మద్యం పర్మిట్ రూమ్‌కు నహీమ్ రాగా.. ముందస్తు సమాచారంతో వచ్చిన మహేష్ తన అనుచరులతో కలిసి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. నహీమ్ తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పటికీ, వెంటాడి మరీ రాడ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.

సమాచారం అందుకున్న వెంటనే నాగోల్ పోలీసులు ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించి ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

మల్కాజ్‌గిరి సీసీఎస్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు ఉమామహేశ్వర్‌తో పాటు మరొక ఐదుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన పదునైన ఆయుధాలు, ప్రయాణించిన వాహనాన్ని సీజ్ చేశారు. పాత కక్షలు, ముఠా తగాదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని తెలిసింది. నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More