...
...
Next Story

హాస్టల్‌ బాత్రూంలో విద్యార్థిని ప్రసవం.. అడ్మిషన్ తీసుకోవడానికి ముందే ప్రెగ్నెంట్!

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాల వసతిగృహంలో విషాదం నెలకొంది. మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని హాస్టల్ బాత్రూంలో ప్రసవించగా పుట్టిన మగ శిశువు మృతి చెందింది.

Published on: Nov 26, 2026, 07:10:52 IST
Advertisement

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల డిగ్రీ కళాశాల వసతిగృహంలో ఓ విద్యార్థిని బాత్రూంలోనే ప్రసవించింది. దురదృష్టవశాత్తు ఆ పసికందు కళ్లు తెరవకముందే ప్రాణాలు విడిచాడు. ఈ హృదయవిదారక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ప్రతీకాత్మక చిత్రం (Unsplash)
ప్రతీకాత్మక చిత్రం (Unsplash)

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని ఓ మారుమూల తండాకు చెందిన యువతి, ఉన్నత విద్య కోసం మహబూబాబాద్‌లోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరంలో చేరింది. ఈ ఏడాది జులై 15న ఆమె కళాశాలలో అడ్మిషన్ తీసుకుంది. అయితే కళాశాలలో చేరడానికి ముందే ఆమె గర్భవతి అయినట్లు తెలుస్తోంది.

భయమో లేదా ఇతర కారణాల వల్లనో గానీ, తను గర్భవతి అన్న విషయాన్ని ఆమె కన్నవారికి గానీ, హాస్టల్ సిబ్బందికి గానీ తెలియకుండా నెలల తరబడి తనలోనే దాచుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆమెకు తీవ్రమైన కడుపునొప్పి మొదలైంది. పురిటి నొప్పులను సాధారణ నొప్పిగా భావించిందో లేదా బయటకు చెప్పుకోలేక పోయిందో గానీ, ఆమె ఎవరికీ చెప్పకుండా హాస్టల్ బాత్రూంకు వెళ్లింది. అక్కడే తీవ్ర నొప్పుల మధ్య ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది.

విషయం గమనించిన తోటి విద్యార్థినులు, హాస్టల్ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. రక్తస్రావంతో నీరసించిపోయిన విద్యార్థినిని, అప్పుడే పుట్టిన శిశువును హుటాహుటిన మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రస్తుతం ఆ విద్యార్థిని ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతోంది.

ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపాల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు మహబూబాబాద్ టౌన్ సీఐ రఘుపతి రెడ్డి వెల్లడించారు. విద్యార్థిని గర్భం దాల్చడానికి కారణమెవరు? ఆమెను ఎవరైనా మోసం చేశారా? లేక మరేదైనా కోణం ఉందా? అన్న దిశగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. విద్యార్థిని ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఆమె వాంగ్మూలం సేకరించి పూర్తి వివరాలు రాబట్టనున్నారు.

వసతిగృహాల్లో ఉండే బాలికలు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, వారు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను చెప్పుకునేలా కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వస్తున్నాయి. భయం, అవగాహన లోపం వల్ల యువతులు ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా అందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks