ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బిగ్ షాక్ - ఫిరాయింపు కేసులో అనర్హత వేటు వేసిన హైకోర్టు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపుల పిటిషన్లను విచారించిన న్యాయస్థానం…. ఆయనపై అనర్హత వేటు వేస్తూ సంచలన తీర్పునిచ్చింది.

Published on: Sep 18, 2026, 16:17:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి…. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ సభ్యత్వంపై న్యాయస్థానం తీవ్ర నిర్ణయం తీసుకుంది. ఆయనపై అనర్హత వేటు వేస్తూ కీలక తీర్పును వెలువరించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

బీఆర్ఎస్, బీజేపీ పిటిషన్లకు ఆమోదం

గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ మారిన ఆయనపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సమగ్ర విచారణ జరిపిన న్యాయస్థానం…. ప్రతిపక్షాల వాదనలతో ఏకీభవించి వారి పిటిషన్లను పునఃసమీక్షించి ఆమోదించింది.

దానం నాగేందర్‌పై వచ్చిన అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని, పిటిషన్లను తోసిపుచ్చడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. స్పీకర్ ఉత్తర్వులను పక్కన పెడుతూ ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు సంచలన తీర్పునిచ్చింది.

శాసనసభ సభ్యుడిగా ఉంటూనే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ గుర్తుపై లేదా అధికారికంగా ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగడం పార్టీ ఫిరాయింపుల చట్టం కిందకే వస్తుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ ప్రాతిపదికగా తీసుకుంటూ ఆయనపై అనర్హత వేటు వేస్తున్నట్లు ధర్మాసనం వెల్లడించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేపై కోర్టు ఈ స్థాయిలో కఠిన తీర్పును వెలువరించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్… సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అక్కడ ఏదైనా ఉపశమనం లభిస్తుందా లేక హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్థిస్తుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

న్యాయం గెలిచింది - పాడి కౌశిక్ రెడ్డి

ఈ తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ఈ తీర్పు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెంపపెట్టు వంటిదని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తాము చేసిన న్యాయం పోరాటం ఫలించిందని వ్యాఖ్యానించారు. దానం నాగేందర్ మాత్రమే కాకుండా మరో 8 మంది ఎమ్మెల్యేల కేసులోనూ ఇదే తరహా తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ తప్పకుండా విజయం సాధిస్తుందన్నారు.

మరోవైపు ఈ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో తెల్లం వెంకట్‌రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్‌, కడియం శ్రీహరి ఉన్నారు. వీరంతా కూడా న్యాయపోరాటం చేస్తున్నారు. అయితే వీరంతా కూడా తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెబుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఒకరిగా ఉన్న దానం నాగేందర్…. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫారమ్ పై సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ… బీఆర్ఎస్ తో పాటు బీజేపీ నేతలు ఎమ్మెల్యే దానంను చాలా రోజులుగా టార్గెట్ చేస్తున్నారు. దానంపై అనర్హత పిటిషన్ వేసిన వాళ్లలో ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాకుండా… బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పిటిషన్లను అనుమతించిన హైకోర్టు…. సంచలన తీర్పుని వెలువరించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More