మంచిర్యాలలో లారీ, ఆటో ఢీకొని ముగ్గురు యువతులు మృతి.. మరో ముగ్గురి పరిస్థితి విషమం!

మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీకొని ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

Published on: Sep 28, 2026, 11:27:35 IST
By , Mancherial
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీపంలోని నస్పూర్ గేట్ ఏరియా జాతీయ రహదారిపై ఆటో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు మందమర్రి మండలం గుడిపల్లి, పొన్నారం గ్రామస్తులుగా గుర్తించారు.

మంచిర్యాల రోడ్డు ప్రమాదం
మంచిర్యాల రోడ్డు ప్రమాదం

ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది ఆటో. మృతిచెందినవారు సౌందర్య, రమ్య, రవళి.. ముగ్గురు యువతులు మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నారు. రోజులాగే ఉదయం విధుల్లోకి వెళ్లడానికి ఆటోలో బయల్దేరుతారు. మార్గమధ్యంలో నస్పూర్ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది.

ఆటోకు బైక్ అడ్డు వచ్చింది. బైక్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్. వాహనాన్ని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

బోల్తా పడిన ప్రైవేట్ బస్సు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మానవపాడు మండలానికి చెందిన బోరవెల్లి సమీపంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పాఠశాల విద్యార్థులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పి ఊపిరి పీల్చుకున్నారు.

బస్సులో ప్రయాణిస్తున్న వారంతా తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన 'హోలీక్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్' విద్యార్థులు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసి, ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి కర్నూలు వైపు పంపించారు.

అడిషనల్ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. అడిషనల్ కలెక్టర్ ధార వేణుగోపాల్ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి భద్రాద్రి వస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్‌ను మరో వాహనంలో భద్రాద్రికి తరలించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More