ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
కవ్వాల్ అభయారణ్యానికి సైబీరియా, మధ్య ఆసియా నుండి అరుదైన వలస పక్షులు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్‌కు సైబీరియా, మధ్య ఆసియా నుండి అరుదైన వలస పక్షులు తరలివచ్చాయి. జన్నారం ఫారెస్ట్ డివిజన్‌లో 5 విదేశీ పక్షి జాతులను గుర్తించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (Kawal Tiger Reserve) మరోసారి విదేశీ అతిథులతో కళకళలాడుతోంది. శీతాకాలం ప్రారంభం కావడంతో సైబీరియా, మధ్య ఆసియా, ఇతర ఉత్తర ప్రాంతాల నుండి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి అరుదైన వలస పక్షులు కవ్వాల్ అడవులకు చేరుకుంటున్నాయి. గత కొద్ది రోజులుగా జన్నారం ఫారెస్ట్ డివిజన్, పరిసర ప్రాంతాల్లో ఐదు ప్రధాన వలస పక్షి జాతులను అటవీ అధికారులు, వన్యప్రాణి పరిశోధకులు గుర్తించారు. ఈ పరిణామం కవ్వాల్ అభయారణ్య జీవవైవిధ్య ప్రాముఖ్యతను మరోసారి నొక్కిచెబుతోంది.

జన్నారం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ ఎం. రామ్మోహన్, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ కోఆర్డినేటర్, వన్యప్రాణి పరిశోధకుడు వెంకట్ అనగందుల సంయుక్తంగా చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విదేశీ పక్షులు కెమెరాలకు చిక్కాయి. కేవలం రిజర్వ్ ఫారెస్ట్ లోపలే కాకుండా, బయటి చెరువులు, వ్యవసాయ క్షేత్రాల వద్ద కూడా ఇవి సంచరిస్తూ ఆకట్టుకుంటున్నాయి.
కవ్వాల్‌లో సందడి చేస్తున్న 5 ప్రధాన వలస పక్షులు
రెడ్-హెడెడ్ బంటింగ్ (Red-headed Bunting) శాస్త్రీయ నామం Emberiza bruniceps. ఎర్రటి-గోధుమ రంగు తల, పసుపు రంగు శరీరంతో ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ చిన్న పక్షి మధ్య ఆసియాలో సంతానోత్పత్తి చేస్తుంది. శీతాకాలంలో వలస వస్తుంది. ఇవి ఎక్కువగా పొదలు, గడ్డిభూములు, పంట పొలాల్లో ఉంటూ గింజలు, ధాన్యాలు, కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
ఆలివ్-బ్యాక్డ్ పిపిట్ (Olive-backed Pipit) శాస్త్రీయ నామం Anthus hodgsoni. హిమాలయ ప్రాంతాలు, ఉత్తర, తూర్పు ఆసియాలో నివసించే ఈ పక్షులు చలికాలంలో దక్షిణ భారతానికి వలస వస్తాయి. అటవీ అంచులు, చెట్ల మధ్య ఖాళీ ప్రదేశాల్లో సంచరిస్తూ కీటకాలు, చిన్న పురుగులు, విత్తనాలను తింటాయి.
సైబీరియన్ స్టోన్‌చాట్ (Siberian Stonechat) శాస్త్రీయ నామం Saxicola maurus. సైబీరియా, మధ్య, ఉత్తర ఆసియా నుండి తెలంగాణకు వచ్చే మరో ముఖ్యమైన శీతాకాలపు అతిథి ఇది. గడ్డిభూములు, చిత్తడి నేలల అంచులు, పంట పొలాల్లో కనిపిస్తూ కీటకాలను ఆహారంగా తీసుకుంటుంది.
గార్గనీ (Garganey) శాస్త్రీయ నామం Spatula querquedula.
నార్తర్న్ పిన్‌టైల్ (Northern Pintail) శాస్త్రీయ నామం Anas acuta.
గార్గనీ, నార్తర్న్ పిన్‌టైల్ రెండూ వలస వచ్చే నీటి బాతు జాతులు. ఉత్తర ప్రాంతాల్లో సంతానోత్పత్తి జరిపే ఇవి, శీతాకాలంలో ఆహారం కోసం మంచినీటి సరస్సులు, రిజర్వాయర్లు, లోతు తక్కువగా ఉండే చెరువులను వెతుక్కుంటూ కవ్వాల్ ప్రాంతానికి చేరుకున్నాయి.
కవ్వాల్ టైగర్ రిజర్వ్, దాని పరిసర మంచినీటి ఆవాసాల్లో ఈ ఏడాది జనవరి 3 నుండి 18 వరకు నిర్వహించిన వార్షిక నీటి పక్షుల గణనలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సర్వేలో స్థానిక పక్షులతో పాటు శీతాకాలపు వలస పక్షులు కలిపి మొత్తం 70కి పైగా జాతులను గుర్తించారు. వీటిలో నార్తర్న్ పిన్‌టైల్, కామన్ రెడ్‌షాంక్, రెడ్-క్రెస్టెడ్ పోచార్డ్, కామన్ టీల్, కాటన్ పిగ్మీ గూస్, శాండ్‌పైపర్స్, టెమ్మింక్స్ స్టింట్ వంటి అరుదైన పక్షులు ఉన్నాయి.
ఖండాంతరాలు దాటి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్‌కు వచ్చే వలస పక్షులు సాధారణంగా మార్చి నెల వరకు ఇక్కడే విడిది చేస్తాయి. ఎండలు ముదరడం ప్రారంభం కాగానే, సంతానోత్పత్తి కోసం తిరిగి తమ స్వస్థలాలకు పయనమవుతాయి. వలస పక్షుల రాక అనేది ఆ ప్రాంతపు పర్యావరణ సమతుల్యతకు, ఆరోగ్యకరమైన అటవీ, జల ఆవాసాలకు నిదర్శనమని పర్యావరణవేత్తలు చెబుతున్నారు.
పక్షుల వలస మార్గాలు, వాటి ఆవాస ప్రాధాన్యతలను లోతుగా అర్థం చేసుకోవడానికి క్రమబద్ధమైన పర్యవేక్షణ, సీజనల్ బర్డ్ సర్వేలు, దీర్ఘకాలిక డాక్యుమెంటేషన్ ఎంతో అవసరమని ఎఫ్‌డీఓ ఎం. రామ్మోహన్ పేర్కొన్నారు. అటవీ శాఖ, వన్యప్రాణి పరిశోధకులు, పరిరక్షణ సంస్థలు, స్థానిక ప్రజల సమన్వయంతో పనిచేస్తే జీవవైవిధ్య డాక్యుమెంటేషన్‌ను మరింత బలోపేతం చేయవచ్చన్నారు. తద్వారా భవిష్యత్ పరిరక్షణ ప్రణాళికలను సమర్థవంతంగా రూపొందించవచ్చని చెప్పారు.

E-Paper
