భువనగిరి కోటకు సరికొత్త హంగులు - రూ. 56 కోట్లతో భారీ టూరిజం ప్రాజెక్ట్..! పనుల పూర్తికి డెడ్ లైన్

Bhongir Fort Development Ropeway Project : భువనగిరి కోటను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు. ఈ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద రూ. 56.81 కోట్లతో రోప్‌వే, పర్యాటక హంగుల పనులను అక్టోబర్ 2 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Published on: Jun 22, 2026, 12:24:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhongir Fort Ropeway Project : చారిత్రాత్మక భువనగిరి కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోటపై నిర్మిస్తున్న రోప్‌వే, హోటల్, పార్కింగ్ వసతులు, విశ్రాంతి గదులు, పిల్లల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫెటేరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, పర్యాటకులకు అవసరమైన ఇతర వసతుల పురోగతిని అధికారులతో కలిసి సోమవారం సమీక్షించారు.

భువనగిరి కోట
భువనగిరి కోట

కోట వద్ద సాగుతున్న పనులన్నింటినీ రాబోయే అక్టోబర్ 2వ తేదీ (గాంధీ జయంతి) నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అవసరమైతే రాత్రింబగళ్లు (24 గంటలు) షిఫ్టుల వారీగా పనులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

"ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. భువనగిరి కోట చారిత్రక వైభవాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా, దానికి ఆధునిక హంగులు అద్దుతున్నాం. యాదాద్రి, భువనగిరి కోట, కొలనుపాకలను కలుపుతూ ఒక సమగ్ర ఆధ్యాత్మిక, వారసత్వ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పని చేస్తోంది" అని మంత్రి జూపల్లి కృష్ణారావు వివరించారు.

కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రవేశపెట్టిన 'స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0' కింద తెలంగాణలోని భువనగిరి కోటను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా "భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్" ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.56.81 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది.

ఈ బృహత్తర ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.. కోట యొక్క పురాతన వారసత్వాన్ని సంరక్షిస్తూనే, ఆధునిక మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాలు మరియు ప్రయాణికుల కోసం ఒక అత్యాధునిక రోప్‌వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం. ఫలితంగా పర్యాటకులు సులభంగా కోటను సందర్శించే వీలు కలగడమే కాకుండా…. వారికి సరికొత్త అనుభూతి లభిస్తుంది.

ఈ ప్రాజెక్ట్ విశేషాలు :

  • ప్రాజెక్ట్ మొత్తం అంచనా వ్యయం : రూ.56.81 కోట్లు
  • ఈ మొత్తం నిధులను రెండు ప్రధాన విభాగాలుగా విభజించి పనులను చేపట్టనున్నారు.
  • ప్యాసింజర్ రోప్‌వే వ్యవస్థ అభివృద్ధి (కేటాయించిన నిధులు: రూ.17.91 కోట్లు)
  • కొండపైకి పర్యాటకులు సులభంగా చేరుకునేందుకు అత్యంత రక్షణ ప్రమాణాలతో ఈ రోప్‌వేను నిర్మిస్తున్నారు.
  • రోప్‌వే విధానం : మోనోకేబుల్ జిగ్ బ్యాక్ సిస్టమ్ (Monocable Jig Back System).
  • రోప్‌వే పొడవు : సుమారు 1,020 మీటర్లు.
  • ఎత్తులో వ్యత్యాసం : మైదానం నుంచి కొండపైకి సుమారు 180 మీటర్ల ఎత్తు.
  • క్యాబిన్ల సంఖ్య : 6 + 1 క్యాబిన్లు
  • ఒక క్యాబిన్ సామర్థ్యం : ఒక్కో క్యాబిన్‌లో ఒకేసారి 6 గురు ప్రయాణించవచ్చు.
  • రోప్‌వే రవాణా సామర్థ్యం : గంటకు 250 నుండి 300 మంది ప్రయాణికులను చేరవేస్తుంది.
  • వేగం : సెకనుకు 0 నుండి 6 మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
  • ఈ రోప్‌వేకు సంబంధించిన డిజైన్, సరఫరా, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ మరియు కమీషనింగ్ పనులన్నింటినీ 'టర్న్‌కీ' (turnkey) ప్రాతిపదికన రవాణా శాఖ పర్యవేక్షణలో పూర్తి చేయనున్నారు.
  • హెరిటేజ్ కట్టడాల పునరుద్ధరణ, సివిల్ మౌలిక వసతుల కల్పన (కేటాయించిన నిధులు: రూ.38.90 కోట్లు)

రోడ్డు మార్గాలు - పార్కింగ్ వసతులు:

కోట వైపు వెళ్లే 30 మీటర్ల రైట్ ఆఫ్ వే (ROW) పార్కింగ్ రోడ్డు వెంబడి కొత్తగా అప్రోచ్ రోడ్డు, వాహనాల పార్కింగ్ స్థలం, వర్షపు నీటి కాలువలు, బాక్స్ కల్వర్టులు ,రక్షణ గోడలను నిర్మిస్తారు. పర్యాటకుల అంతర్గత రవాణా కోసం 20 సంఖ్యలో 'సిక్స్ సీటర్' (6 సీట్లు గల) ఈ-వెహికల్స్ (ఎలక్ట్రిక్ వాహనాలు), వాటి ఛార్జింగ్ కోసం 2 సంఖ్యలో 60A డీసీ వాల్‌బాక్స్ ఛార్జర్లను ఏర్పాటు చేస్తున్నారు. రోప్‌వే లోయర్ స్టేషన్ పరిధిలోని 2.9 ఎకరాల విస్తీర్ణంలో రోడ్లు, పార్కింగ్ జోన్లు, తుఫాను నీటి కాలువలు మరియు పాదచారుల నడక మార్గాలను (ఫుట్‌పాత్) అభివృద్ధి చేస్తారు.

  • అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ (పరిపాలనా భవనం), ప్రస్తుతం ఉన్న పాత టాయిలెట్ బ్లాక్ ఆధునీకరణ, ప్రధాన ప్రవేశ ద్వారం, కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపడతారు.
  • ప్రత్యేక ఆకర్షణగా శిల్పకళా క్షేత్రం (స్కల్ప్చర్ ఏరియా), పెర్గోలాస్ (సుందరమైన పందిళ్లు), ఫుడ్ కియోస్క్‌లు, పర్యాటకులు కూర్చునే ప్రదేశాలు, రాతి క్లాడింగ్‌తో కూడిన ఇటుక గోడలను నిర్మిస్తారు.
  • కొత్తగా మరో టాయిలెట్ బ్లాక్, వ్యూయింగ్ గ్యాలరీ (కోట అందాలను చూసే వేదిక), అధునాతన కేఫెటేరియా, అందమైన జలాశయాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు కొండపైకి వెళ్లే మెట్లను మరింత అనుకూలంగా మార్చడం (స్టెప్స్ చిసెలింగ్), రాతి కట్టడాల మరమ్మతులు, పాత మెట్ల పునరుద్ధరణ మరియు పారిశుద్ధ్య ఏర్పాట్లు పూర్తి చేస్తారు.

చారిత్రక కట్టడాల పునరుద్ధరణ:

  • భువనగిరి కొండపై శతాబ్దాల నాటి పురాతన కట్టడాలను వాటి సహజత్వం దెబ్బతినకుండా పునరుద్ధరిస్తారు.
  • ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్ (కోట చరిత్రను వివరించే కేంద్రం) పైభాగంలో అత్యాధునిక టెన్సిల్ స్ట్రక్చర్ రూఫ్‌ను ఏర్పాటు చేస్తారు.
  • కోట లోపలి భాగంలో మరియు వెలుపల పూర్తిస్థాయి విద్యుద్దీకరణ పనులు చేపడతారు.
  • అవుట్‌డోర్ లైటింగ్, వీధి దీపాలు, రోప్‌వే పరిసర ప్రాంతాలతో పాటు కొండపై ఉన్న పర్యాటక వసతుల వద్ద రాత్రి వేళల్లో వెలుతురు ఉండేలా లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
  • తాగునీటి సరఫరా వ్యవస్థ మరియు భారీ నీటి సంప్‌ను నిర్మిస్తారు.
  • మురుగునీటి నిర్వహణ కోసం బయో డైజెస్టర్ ట్యాంకులను, ఘన వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేస్తారు.
  • కోట మొత్తం భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, కెమెరా పోల్స్ మరియు పబ్లిక్ అనౌన్స్‌మెంట్ (మైక్) సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
  • అత్యవసర సమయాల్లో సహాయం కోసం ఎమర్జెన్సీ కాల్ బాక్స్‌లు మరియు వాటి మౌలిక వసతులను కల్పిస్తారు.
  • నిరంతర నిఘా దృశ్యాల రికార్డింగ్ కోసం 45 రోజుల స్టోరేజ్ కెపాసిటీ కలిగిన 32 ఛానల్ ఎన్‌వీఆర్ (NVR) సిస్టమ్స్ వాడుతున్నారు.
  • కరెంట్ పోయినా నిఘా ఆగిపోకుండా ఉండేందుకు 1 గంట బ్యాకప్ ఇచ్చే యూపీఎస్ (UPS) వ్యవస్థను పెడుతున్నారు.
  • పర్యాటకుల రద్దీని నియంత్రించడానికి క్రౌడ్ మేనేజ్‌మెంట్ అండ్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను, భద్రతా తనిఖీల కోసం డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు (DFMD) మరియు ఎక్స్-రే బ్యాగేజ్ స్కానింగ్ సొల్యూషన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
  • హై-క్వాలిటీ వీడియో ఫీడ్స్ బదిలీ కోసం 100 Mbps సామర్థ్యం గల ఇంటర్నెట్ లీజ్డ్ లైన్‌ను అనుసంధానిస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థల నిర్వహణకు ఒక ప్రత్యేక ఆపరేషన్ టీమ్‌ను నియమించడంతో పాటు, 3 సంవత్సరాల పాటు సమగ్ర రక్షణాత్మక నిర్వహణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More