Budget electric scooter : మర్కెట్లోకి బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్- డ్రైవింగ్ లైసెన్స్ కూడా అక్కర్లేదు!
Ampere Reo VYB : భారత ఈవీ మార్కెట్లోకి యాంపియర్ సంస్థ సరికొత్త బడ్జెట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘రియో వైబ్’ను విడుదల చేసింది. రూ.69,499 ప్రారంభ ధరతో వచ్చిన ఈ స్కూటర్‌కు ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. పూర్తి వివరాల్లోకి వెళితే..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ అవసరాల కోసం, తక్కువ దూర ప్రయాణాల కోసం బడ్జెట్ ధరలో లభించే ఈవీ టూ-వీలర్లను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ సంస్థ యాంపియర్ తన ఎంట్రీ-లెవల్ ఈవీ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించింది. మార్కెట్లోకి సరికొత్త ‘యాంపియర్ రియో వైబ్’ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధరను రూ. 69,499 (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

పట్టణాల్లో ప్రతిరోజూ ఆఫీసులకు వెళ్లేవారు, కాలేజ్ విద్యార్థులు, సీనియర్ సిటిజన్లు (వృద్ధులు), మొదటిసారి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారిని టార్గెట్ చేస్తూ అంపేర్ ఈ బడ్జెట్ వాహనాన్ని డిజైన్ చేసింది. ఇదొక లో-స్పీడ్ (తక్కువ వేగంతో వెళ్లే) ఎలక్ట్రిక్ స్కూటర్ కావడం గమనార్హం.
యాంపియర్ రియో వైబ్- లైసెన్స్, రిజిస్ట్రేషన్ల తలనొప్పి లేదు!
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీనిని నడపడానికి ఎలాంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు! అలాగే ఆర్టీఓ ఆఫీసు చుట్టూ తిరిగి వెహికల్ రిజిస్ట్రేషన్ చేయించాల్సిన పని కూడా లేదు. నగరాల్లో తక్కువ దూర ప్రయాణాలు చేసేవారికి, ట్రాఫిక్‌లో సులభంగా ప్రయాణించడానికి ఇదొక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
ఎందుకంటే.. దీని గరిష్ఠ వేగం 25 కేఎంపీహెచ్ కాబట్టి!
యాంపియర్ రియో వైబ్- బ్యాటరీ, రేంజ్..
సాంకేతిక వివరాల విషయానికి వస్తే.. యాంపియర్ రియో వైబ్ స్కూటర్‌లో 250డబ్ల్యూ ఎలక్ట్రిక్ హబ్ మోటార్‌ను అమర్చారు. దీనికి తోడుగా 1.44 కేడబ్ల్యూహెచ్ సామర్థ్యం గల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ స్కూటర్ ఒకే ఒక్క పూర్తి ఛార్జింగ్‌పై గరిష్టంగా 80 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
సాధారణ సాంప్రదాయ బ్యాటరీలతో పోలిస్తే ఈ ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీలు ఎక్కువ కాలం మన్నుతాయి. ఎక్కువ లైఫ్‌సైకిల్ కలిగి ఉండటం వల్ల ప్రతిరోజూ ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు.
యాంపియర్ రియో వైబ్- ఫీచర్లలో తగ్గలేదు.. సేఫ్టీ కూడా సూపర్!
తక్కువ ధరకే లభిస్తున్నప్పటికీ.. వినియోగదారుల సౌకర్యం కోసం యాంపియర్ కంపెనీ ఇందులో ఎన్నో ఆధునిక ఫీచర్లను జోడించింది.
ముఖ్యమైన ఫీచర్ల జాబితా:
- రంగురంగుల కలర్ ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- స్మార్ట్ కీ ఫోబ్ ద్వారా నడిచే కీలెస్ స్టార్ట్ ఫంక్షన్
- ప్రయాణంలో మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్
- రాత్రి వేళల్లో లుక్ పెంచే యాంబియంట్ సైడ్ లైటింగ్
- సామాన్లు పెట్టుకోవడానికి వీలుగా సీటు కింద ఏకంగా 24 లీటర్ల భారీ అండర్-సీట్ స్టోరేజ్ స్పేస్‌ను ఇచ్చారు. ఇందులో కాలేజ్ బ్యాగులు, కూరగాయలు, కిరాణా సామాగ్రి లేదా ఇతర పర్సనల్ వస్తువులను సులభంగా సర్దుకోవచ్చు.
మరోవైపు భద్రత పరంగానూ కంపెనీ తగిన జాగ్రత్తలు తీసుకుంది. ఈ స్కూటర్ ముందు చక్రానికి డిస్క్ బ్రేక్ సెటప్, వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ అందించారు. వీటితో పాటు ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్, ట్యూబ్‌లెస్ టైర్లను అమర్చారు. ఇందులో వాడిన ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీ వల్ల థర్మల్ స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల బ్యాటరీ సురక్షితంగా ఉండటమే కాకుండా మంటలు అంటుకునే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది.
యాంపియర్ రియో వైబ్- స్టైలిష్ కలర్స్.. గట్టి పోటీ!
యాంపియర్ రియో వైబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ యువతను ఆకట్టుకునేలా నాలుగు విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. ఈ స్కూటర్ చాలా తక్కువ బరువుతో, కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల భారీ ట్రాఫిక్ ఉన్న సిటీ రోడ్లపై కూడా చాలా సులభంగా కంట్రోల్ చేయవచ్చు.
భారతదేశంలో ప్రస్తుతం లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగానికి మంచి డిమాండ్ ఉంది. మార్కెట్లోకి అడుగుపెడుతున్న ఈ సరికొత్త యాంపియర్ రియో వైబ్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న కైనెటిక్ గ్రీన్ ఈ-లూనాతో పాటు ఇతర బడ్జెట్ నగర ఈవీ మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


