హైదరాబాద్ లోని పేదలకు శుభవార్త - మార్చి చివరి నాటికి ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక..!
హైదరాబాద్ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై కీలక ప్రకటన వచ్చేసింది. మార్చి చివరి నాటికి లబ్దిదారుల ఎంపిక జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి వివరాలను వెల్లడించారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటిే గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతోంది. చాలా చోట్ల గృహా ప్రవేశాలు కూడా చేస్తున్నారు. అయితే నగర, పట్టణ పరిధిలోని పేదలకు మాత్రం ఇంకా ఈ స్కీమ్ ను వర్తింపజేయలేదు. వీరి విషయంలో గత కొంతకాలంగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తాజాగా రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

మంగళవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్ బాబు, హైదరాబాద్ ఇంఛార్జ్ మంత్రి పొన్నం, మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్ తో కలిసి మంత్రి పొంగులేటి... ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, లబ్ధిదారుల ఎంపికపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో హౌసింగ్ కార్యదర్శి విపి గౌతమ్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు పాల్గొన్నారు.
హైదరాబాద్‌కు దూరంగా గతంలో 42వేల ఇండ్లను నిర్మించగా అందులో సగం మంది మాత్రమే అక్కడ నివసిస్తున్నారని ఇటీవల నిర్వహించిన క్షేత్రస్ధాయి సర్వేలో తేలిందని మంత్రి పొంగులేటి తెలిపారు. హైదరాబాద్ కు దూరంగా ఇండ్లను నిర్మించడం వల్ల ప్రజలు మురికివాడల్లోనే జీవనం కొనసాగిస్తున్నారని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు.
మార్చి చివరి నాటికి లబ్ధిదారుల ఎంపిక - మంత్రి
పేదల ఉపాధికి ఇబ్బంది కలగకుండా, మురికివాడల్లో నివసించే వారి కోసం, వారు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతాలకు సమీపంలోనే 5 నుంచి 10 అంతస్తుల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని చర్చించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను మార్చి చివరి నాటికి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చర్చించామని తెలిపారు.
సొంత స్థలం కలిగిన 28 వేల మంది లబ్ధిదారులకు ఈ నెల చివరిలోగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేయడం జరుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను లబ్ధిదారులే పూర్తి చేసుకునేలా హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. జేఎన్ఎన్‌యూ ఆర్ ఎం పధకంలో నిర్మించిన ఇండ్లు శిధిలావస్ధలో ఉన్నవాటి స్ధానంలో కూడా ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలని ఆ దిశగా ఆలోచన చేయాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు.
ఆర్ఆర్ఆర్ - ఓఆర్ఆర్ మధ్య మధ్యతరగతి ప్రజల కోసం కేపీహెచ్‌బీ తరహాలో సరసమైన ధరలకే ఇండ్ల నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైందని మంత్రి పొంగులేటి తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస వసతుల కల్పనలో నిర్లక్ష్యం వహించొద్దని అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి పేదవాడికి రాజకీయాలకు అతీతంగా ఇల్లు అందాలన్నదే ప్రజాప్రభుత్వ సంకల్పమని చెప్పారు. అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

