తెలంగాణ అభివృద్ధికి కొత్తగా మూడు రకాల పాలసీలు.. ప్యూర్, క్యూర్, రేర్ : సీఎం రేవంత్ రెడ్డి
గతాన్ని ఒక అనుభవంగా భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణను అద్బుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, సలహాదారులు తెలంగాణ రైజింగ్ 2047 గురించి చర్చించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 8,9వ తేదీల్లో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోపాటుగా ప్రముఖులను స్వయంగా ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

తాజాగా తెలంగాణ రైజింగ్ 2047 మీద చర్చించిన తర్వాత రేవంత్ రెడ్డి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న తరుణంలో భవిష్యత్తులో రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టడానికి, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసుకోవడానికి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగిందని వివరించారు. తెలంగాణను ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టడానికి విజన్‌తో పాటు దాన్ని అమలు చేసే వ్యూహంతో ముందుకు వెళుతున్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రం అభివృద్ధి సాధించాలంటే స్పష్టమైన పాలసీ ఉండాలన్నారు సీఎం రేవంత్. ప్రపంచ స్థాయి పేరెన్నికగన్న దిగ్గజాలు, పారిశ్రామిక వేత్తలు, ప్రతిష్టాత్మక సంస్థలను భాగస్వామ్యం చేసి, ప్రతి అంశాన్ని లోతుగా క్షుణ్ణంగా విశ్లేషించి డాక్యుమెంట్‌లో భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని సాధిస్తూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడానికి తెలంగాణను మూడు విభాగాలుగా విభజించి స్పష్టమైన ప్రణాళికలను రూపొందించాం.
హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించామని సీఎం అన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ వంటి 4 రకాల పాలన సాగుతుండేదన్నారు. ఈ మహానగరం ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులు, కష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికా బద్ధంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ గా గుర్తించామని చెప్పారు. ప్రధానంగా పారిశ్రామిక కాలుష్యం, మూసీ, పురాతన వాహనాలు, వాయు కాలుష్యం వంటి వాటిని తగ్గించడం ద్వారా నెట్ జీరో నగరంగా మార్చాలని ప్యూర్ గా నిర్దేశించామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పారంటే
- దేశంలో మెట్రోపాలిటన్ నగరాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. అలాంటి సంక్షోభాలను హైదరాబాద్ నగరానికి ఎదురుకాకుండా ఉండేందుకు 2170 చదరపు కి.మీ కోర్ అర్బన్ ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్‌గా గుర్తిస్తున్నాం. కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలను బయటకి తరలిస్తున్నాం. వరద సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు లేకుండా తీర్చిదిద్దుతాం.
- అలాగే కోర్ అర్బన్ రీజియన్ ఒక యూనిట్‌గా మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి రోడ్ల విస్తరణ వంటి అన్ని రకాల ప్రణాళికతో ముందుకు వెళ్లడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించి సర్వీస్ సెక్టర్‌గా మార్చుతున్నాం.
- ఓఆర్ఆర్ అవతలి వైపు నుంచి తెలంగాణకు మణిహారంలా చేపడుతున్న రీజినల్ రింగ్ రోడ్డు వరకు పెరీ అర్బన్ ఎకానమీ కింద (ప్యూర్) గుర్తించి ఆ ప్రాంతంలో మాన్యుఫాక్చరింగ్ జోన్‌గా నిర్దేశించడం జరిగింది. అందులో ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ, రేడియల్ రోడ్లు, బెంగుళూరు – హైదరాబాద్, అమరావతి మీదుగా హైదరాబాద్ – చెన్నై బుల్లెట్ ట్రెయిన్స్ ప్రతిపాదించాం. వీటి వల్ల రవాణా సులభతమవుతుంది.
- తెలంగాణకు సముద్రం లేని కారణంగా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో మచిలీపట్నం పోర్టు వరకు డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవేను నిర్మించబోతున్నాం. ఇందుకోసం ఇప్పటికే కేంద్రం, ఏపీ రాష్ట్రాలతో సంప్రదింపులు కూడా పూర్తయ్యాయి.
- పరిశ్రమలు అభివృద్ధి చెందాలంటే, పారిశ్రామిక ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల కోసం పటిష్టమైన రవాణా వ్యవస్థ ఉండాలి. మాన్యుఫాక్చరింగ్ జోన్‌లో హైవేలు, పోర్టు కనెక్టివిటీ, ఎయిర్ పోర్టు కనెక్టివిటీ ఉండాలి. వరంగల్‌లో నిర్మిస్తున్న విమానాశ్రయంతో పాటు ఆదిలాబాద్, కొత్తగూడం, రామగుండంలో ఎయిర్ పోర్టులు అదనంగా తెస్తాం. కనెక్టివిటీ పెంచడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దగలం.
- గతంలో నగర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా దృష్టి సారించారు. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించాలని అనుకున్నాం. వ్యవసాయం, దాని ఆధారిత పరిశ్రమలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయదలచుకోలేదు. సారవంతమైన నేలల్లో అనేక రకాల పంటలను పండించడానికి వీలుంది.
- ప్యూర్, క్యూర్, రేర్.. ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి, తద్వారా తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చడానికి తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొస్తున్నాం. ఒక్కో రీజియన్‌లో ప్రాంతాల వారిగా ఏం చేయబోతున్నామన్నది డాక్యుమెంట్‌లో చాలా స్పష్టంగా వివరాలుంటాయి.
- రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి సాధించడం, అలాగే బలహీనంగా ఉన్న పేదలను ఆర్థికంగా బలోపేతం చేయాలని సంకల్పించాం. దేశానికి అవసరానికి మించి ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ ప్రజలకు కావలసిన న్యూట్రిషియస్ ఆహారం అందడం లేదు. నాణ్యమైన విద్య, వైద్యం అందడం లేదు. మారుమూల తండా నుంచి హైదరాబాద్ వరకు సమగ్రాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యం.
- రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పం. మా దార్శనికతే మా భవిష్యత్తు ప్రణాళికలు. తెలంగాణను బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే క్రమంలో ముందుకు వెళ్లడానికి ప్రముఖులందరినీ ఆహ్వానిస్తున్నాం.
- బిజినెస్, స్పోర్ట్స్, ఇండస్ట్రీ, అగ్రికల్చర్, టూరిజం... ఇలా అన్ని రంగాల్లో ప్రగతికి అవసరమైన అన్ని అంశాలు పాలసీలో ఉంటాయి. మా రోల్ మాడల్ చైనా, జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, సింగపూర్‌లను ఆదర్శంగా తీసుకుని వారితో పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే. వారినే ఆదర్శంగా తీసుకున్నాం. ఈ సంకల్పానికి మా ప్రభుత్వానికి అందరి సహకారం కావాలి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


