పవన్ కళ్యాణ్... తెలంగాణ ద్వేషి, ఇక్కడి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి - మంత్రి పొన్నం డిమాండ్
తెలంగాణ అస్తిత్వాన్ని అవమానించిన పవన్ కళ్యాణ్… ఇక్కడి ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే సభలు పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. బీజేపీ డైరెక్షన్ లో తెలంగాణ లో విద్వేషాలు రెచ్చగొట్టి వైషమ్యాలు సృష్టించాలని చూస్తే ఊరుకోరని హెచ్చరించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్,,,, ఇక్కడి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే హైదరాబాద్‌లో 'నవ నిర్మాణ సభ' నిర్వహించుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా బీజేపీ ఎజెండాను మోస్తున్నారని… తెలంగాణపై నిరంతరం విషం కక్కుతున్నారని మంత్రి మండిపడ్డారు.

పవన్… క్షమాపణ చెప్పాలి - మంత్రి పొన్నం
సోమవారం హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి పొన్నం….పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తరువాతనే నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని స్పష్టం చేశారు. "తెలంగాణ ప్రజల కళ్లదృష్టి పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని నాడు మాట్లాడిన పవన్ కళ్యాణ్… ఈరోజు ఇక్కడికి వచ్చి ఏ మొహం పెట్టుకొని సభ నిర్వహిస్తారు..? తెలంగాణ రక్తం ఉన్న ఏ బిడ్డ కూడా ఆయన సభకు వెళ్లడు..," అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని బహిరంగంగా చెప్పుకున్న వ్యక్తి, ఇప్పుడు తెలంగాణపై మొసలి కన్నీరు కారిస్తే చూస్తూ ఊరుకోబోమని మంత్రి హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎవరైనా భాగస్వాములు కావచ్చు కానీ… విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఇక్కడ సభ పెడుతున్నారని ఆక్షేపించారు.
ప్రమాణం చేయగలరా..? మంత్రి సవాల్
పవన్ కళ్యాణ్ కేవలం ఒక సినిమా నటుడని… తెలంగాణ వాతావరణాన్ని కలుషితం చేయడానికి బీజేపీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈ కొత్త నటన మొదలుపెట్టారని మంత్రి ఆరోపించారు.
"బీజేపీ నుంచి రెమ్యునరేషన్ తీసుకోకుండానే తెలంగాణకు రాలేదని కొండగట్టు అంజన్న సాక్షిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేయగలరా..?" అని మంత్రి పొన్నం సవాల్ విసిరారు. 2014లో తాను ఎంపీగా ఉన్నప్పుడు కూడా పవన్ ఇక్కడికి వచ్చి తొడలు కొడతామని మాట్లాడారని గుర్తు చేశారు. డబ్బులు ఇస్తే ఎలాంటి నటనైనా చేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఘాటుగా విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు పవన్ కళ్యాణ్‌కు అధికారాన్ని ఇచ్చారని, ఆయన చేయగలిగిన నవ నిర్మాణం ఏదైనా ఉంటే అక్కడే చూపించుకోవాలని మంత్రి హితవు పలికారు. "కన్నతల్లికి గాజులు కొనలేని వాడు, పినతల్లికి ఒడ్డాణం చేయిస్తానన్నట్టు ఉంది పవన్ వ్యవహారం. కుడితిలో పడ్డ రాయి తీయలేని వాడు.. ఎట్లా రాయి తీస్తాడు?" అంటూ లోకోక్తులతో ఎద్దేవా చేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉండి అక్కడ ఏమీ చేయలేని వ్యక్తి ఇక్కడికి వచ్చి ఏం ఉద్ధరిస్తారని ప్రశ్నించారు. ఈ నవ నిర్మాణ సభలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లేదా కేరళ, తమిళనాడుల్లో ఎందుకు పెట్టడం లేదు..? కేవలం తన బాస్ మోదీని మెప్పించడానికే హైదరాబాద్‌లో పెడుతున్నారా..? అని మంత్రి పొన్నం నిలదీశారు.
చేగువేరా టీ షర్టుతో ప్రారంభమైన పవన్ ప్రస్థానం, ఇప్పుడు మోదీని కౌగిలించుకొని ప్రజల చేత చీవాట్లు తినే స్థాయికి చేరిందని మంత్రి దుయ్యబట్టారు. ఏపీలో విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే కళ్లు అప్పగించి చూశారని…. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీకి కట్టబెడుతున్నా మోదీని ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదని విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నా, జనగణనలో కులగణన చేపట్టకపోయినా నోరు మెదపని పవన్ కళ్యాణ్.. సినిమాల్లో కాకుండా నిజజీవితంలో దేశభక్తి చూపించాలని హితవు పలికారు.
అణువనవున తెలంగాణ వ్యతిరేకతను నింపుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు మీరు క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ ద్వేషి పవన్ కళ్యాణ్. ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తామంటే ఊరుకునేది లేదు. ఇక్కడ బీజేపీ పప్పులు ఉడకక... ఏజెంట్ గా పవన్ కళ్యాణ్ ను పంపిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదు. అందుకే ఇక్కడ బీజేపీ దొడ్డిదారిన పవన్ కళ్యాణ్ ను పంపిస్తోంది" అని మంత్రి పొన్నం ఆరోపించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

