Musi River Rejuvenation : నాగోల్ టు గౌరెల్లి - రాబోయే వంద రోజుల్లో 'మూసీ' ప్రాజెక్ట్ రెండో దశ పనులు
Musi River Rejuvenation Phase 2 : మూసీ నది రెండో దశ ప్రక్షాళన పనులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. వంద రోజుల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి గౌరెల్లి వరకు ఈ పనులు ఉంటాయని తెలిపారు.
Musi River Rejuvenation Phase 2 : హైదరాబాద్ మహానగర రూపురేఖలను మార్చేసే దిశగా మూసీ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగా నాగోల్ నుంచి గౌరెల్లి వరకు సెకండ్ ఫేజ్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. రాబోయే వంద రోజుల్లోనే ఈ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగంగా తొలి దశ పనులను ఇప్పటికే గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఏకంగా రూ.1,511 కోట్ల విలువైన పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. ఉప్పల్ భగాయత్ ఫేజ్-III లో 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.98 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన పరిపాలనా భవనానికి సీఎం శంకుస్థాపన చేశారు.
ప్రజల సౌలభ్యం కోసం, పారదర్శక సేవలను అందించేందుకు వీలుగా 'క్యూర్-1' (Common Unified Billing and Collection System) మొబైల్ అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ నగరం కేవలం పేరుకే గ్లోబల్ సిటీ కాదని…. ఆ స్థాయి సౌకర్యాలు ఉండాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అవుటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ప్రస్తుతం 1.34 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారని, అంతర్జాతీయ కంపెనీలు తరలివస్తున్న తరుణంలో విద్యుత్, పోలీసు, డ్రైనేజీ మరియు మెట్రో వసతులను మెరుగుపరచడం అత్యవసరమని చెప్పారు.
రాష్ట్ర సమగ్ర ప్రగతి కోసం 'తెలంగాణ విజన్ 2047' డాక్యుమెంట్‌ను రూపొందించినట్లు సీఎం వెల్లడించారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న 2100 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజినల్ ఎకానమీ (CURE) ప్రాంతాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి అనే మూడు కార్పొరేషన్లుగా వికేంద్రీకరించినట్లు ప్రకటించారు. అదే పద్ధతిలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసు వ్యవస్థను కూడా వికేంద్రీకరించినట్లు వివరించారు.
నగరంలో నాలుగు వైపులా కలిపి మొత్తం 122 కిలోమీటర్ల మేర మెట్రో రైలును విస్తరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి నొక్కిచెప్పారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్, రాజేంద్రనగర్ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు, అలాగే ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో లైన్లను విస్తరిస్తామని భరోసా ఇచ్చారు. తె
తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎందుకు సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రశ్నించారు. మెట్రోతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు (RRR), మూసీ ప్రక్షాళన వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులందరూ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్థికవృద్ధితో పాటు ఉపాధి అవకాశాలు - సీఎం
"గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్, ఢిల్లీలో యమునా రివర్ ఫ్రంట్, ఉత్తరప్రదేశ్‌లో గంగానది ప్రక్షాళన ప్రాజెక్టులను చేపట్టినప్పుడు, మన భాగ్యనగరంలో మూసీ నదిని ఎందుకు ప్రక్షాళన చేయకూడదు?" అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 55 కిలోమీటర్ల మేర సాగే మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా నగరం ఆర్థికంగా వృద్ధి చెందడమే కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కాలుష్యం కారణంగా నరకప్రాయమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీటితో విషతుల్యంగా మారిన మూసీ కాలుష్యం చివరకు నల్గొండ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోందని, ఒకవైపు ఫ్లోరైడ్, మరోవైపు మూసీ కాలుష్యంతో నల్గొండ నలిగిపోతోందని గుర్తుచేశారు.
మూసీ ప్రాజెక్టు వల్ల ఇళ్లు కోల్పోయే పేదలెవరికీ అన్యాయం జరగనివ్వబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. ఏ ఒక్క పేదవాడిని నిరాశ్రయుడిని చేయమని, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ప్రత్యామ్నాయంగా పక్కా గృహాలు కేటాయించడంతో పాటు, వారి పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

