Eastern Ghats : తూర్పు కనుమల్లో తలకిందులుగా ఈదే కొత్త కీటకం గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం, తెలంగాణలోని అమ్రాబాద్ అడవుల్లో నీటిలో తలకిందులుగా ఈదే కొత్త కీటకాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనికి ఎనిథారెస్ డెక్కనెన్సిస్‌ అని పేరు పెట్టారు.

Published on: Nov 20, 2026, 10:06:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

జీవవైవిధ్య పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో కీలక ముందడుగు వేశారు. తూర్పు కనుమల (Eastern Ghats) పరిధిలోని మంచినీటి ఆవాసాల్లో నీటి ఉపరితలం కింద తలకిందులుగా ఈదే విలక్షణ లక్షణం కలిగిన ఒక కొత్త జల కీటకాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో ఈ కొత్త కీటక జాతిని కనుగొన్నారు.

ఎనిథారెస్ డెక్కనెన్సిస్‌
ఎనిథారెస్ డెక్కనెన్సిస్‌

దక్కన్ పీఠభూమి ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గుర్తించినందున ఈ కొత్త కీటక జాతికి ‘ఎనిథారెస్ డెక్కనెన్సిస్’ (Enithares deccanensis Banerjee et al, 2026) అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇది నోటోనెక్టిడే కుటుంబానికి చెందినది. సాధారణ భాషలో వీటిని ‘బ్యాక్‌స్విమ్మర్స్’ అని పిలుస్తారు. నీటిలో తలకిందులుగా ఉండి, తెడ్డు మాదిరిగా ఉండే తమ పొడవైన వెనుక కాళ్ల సాయంతో అత్యంత వేగంగా ఈదడం వీటి ప్రత్యేకత.

హైదరాబాద్‌లోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI), తమిళనాడు విరుదునగర్‌లోని వీహెచ్ఎన్ఎస్ఎన్ (VHNSN) కళాశాలకు చెందిన పరిశోధకులు సోమేష్ బెనర్జీ, దేవదాస్ కుమార్, డాక్టర్ దీపా జైస్వాల్, కరుతపాండి మాదసామి ఈ అధ్యయనాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ సైన్స్ జర్నల్ ‘జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ’ ఇటీవల ప్రచురించింది.

ఎనిథారెస్ జాతికి చెందిన ఇతర కీటకాలతో పోలిస్తే కొత్త రకం భిన్నమైన శారీరక లక్షణాలను కలిగి ఉంది. దీని రెక్కలపై ముదురు రంగులో ‘V’ ఆకారపు గుర్తు ఉండటంతో పాటు, మగ కీటకంలో కొడవలి ఆకారపు పునరుత్పత్తి అవయవం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.

శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో లేత, ముదురు రంగు రూపాలు రెండూ కనిపించాయి. ఒకే జాతి కీటకాల్లో ఇలా భిన్న రంగులు కనిపించడం జీవశాస్త్ర పరంగా ఆసక్తికరమైన అంశం. ఈ కీటకం పూర్తిగా కొత్త జాతి అని నిరూపించేందుకు పరిశోధకులు సమగ్ర వర్గీకరణ విధానాన్ని అనుసరించారు. బాహ్య రూప పరిశీలనతో పాటు డీఎన్ఏ బార్‌కోడింగ్, ఫైలోజెనెటిక్ విశ్లేషణలు నిర్వహించగా, ఇది ఇతర సమీప జాతుల కంటే 10 నుండి 14.5 శాతం జన్యుపరమైన వ్యత్యాసాన్ని కలిగి ఉందని స్పష్టమైంది.

ఈ కీటకాలు మంచినీటి ఆవాసాల్లో దోమల లార్వాలు, చిన్న కీటకాలు, టాడ్‌పోల్స్‌ను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నీటిలో ఏర్పడే చిన్నపాటి అలజడులను సైతం గుర్తించి ఇవి పసిగడతాయి.

'అడవుల్లో ఉండే చిన్నపాటి మంచినీటి వాగులు, నీడతో కూడిన రాతి గుంతలు, జలపాతాల వద్ద ఏర్పడే మడుగులు ఎంతో అరుదైన జీవవైవిధ్యానికి ఆలవాలంగా నిలుస్తున్నాయి. ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఎన్నో జీవరాశులు ఇలాంటి చిన్న నీటి వనరుల్లో ఉన్నాయని ఈ ఆవిష్కరణ నిరూపిస్తోంది.' అని డాక్టర్ దీపా జైస్వాల్ అన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More