Yawning : ఆవలింతల వెనుక అసలు గుట్టు ఇదేనా? విస్తుపోయే నిజాలు బయటపెట్టిన శాస్త్రవేత్తలు!

Yawning reason : ఆవలింత ఎందుకు వస్తుంది? కేవలం నిద్ర వస్తుందనో, బోరు కొడుతుందనో మాత్రమే కాదు.. ఆవలింత వెనుక ఒక అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెదడును శుభ్రం చేయడంలో ఆవలింతలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తాజా పరిశోధనలో వెల్లడైంది.

Published on: May 2, 2026, 06:43:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Why do we yawn : మనకి బోర్ కొట్టినప్పుడో లేదా నిద్ర వస్తున్నప్పుడో అప్రయత్నంగా ఆవలింతలు తీస్తుంటాం. "ఏంటి.. అప్పుడే నిద్ర వస్తుందా?" అని పక్కవారు అడగడం అలవాటే. అయితే, ఆవలింత అనేది కేవలం అలసటను సూచించే సంకేతం మాత్రమే కాదని, అది మన మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంక్లిష్టమైన మెకానిజం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ (యూఎన్​ఎస్​డబ్ల్యూ) పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనంలో ఆవలింతకు సంబంధించి విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి!

ఆవలింత ఎందుకు వస్తుందో తెలుసా?
ఆవలింత ఎందుకు వస్తుందో తెలుసా?

మెదడు ద్రవంలో కీలక మార్పులు..

మన మెదడు, వెన్నెముక చుట్టూ 'సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్' (సీఎస్​ఎఫ్) అనే ఒక రక్షణ ద్రవం ఉంటుంది. ఇది మెదడుకు పోషకాలను అందించడమే కాకుండా, అందులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. సాధారణంగా మనం గట్టిగా ఊపిరి పీల్చుకున్నప్పుడు ఈ ద్రవం మెదడు వైపు కదులుతుంది. కానీ, ఆవలింత తీసినప్పుడు మాత్రం పరిస్థితి రివర్స్‌లో ఉందని పరిశోధకులు గుర్తించారు.

ఎంఆర్ఐ స్కాన్ల ద్వారా 22 మంది ఆరోగ్యవంతుల తల, మెడ భాగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆవలింత వచ్చినప్పుడు ఈ సీఎస్​ఎఫ్ ద్రవం మెదడు నుంచి దూరంగా కదులుతున్నట్లు వారు గమనించారు.

"మేము ఊహించిన దానికి పూర్తి భిన్నంగా, ఆవలింత సమయంలో ఈ ద్రవం వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది. ఇది మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది," అని న్యూరో సైంటిస్ట్ ఆడమ్ మార్టినాక్ పేర్కొన్నారు.

మెదడుకు ‘వాషింగ్ మిషన్’ లాంటిది!

ఆవలింత సమయంలో మెదడు నుంచి రక్తం బయటకు వెళ్లే వేగం పెరుగుతుంది. దీనివల్ల మెదడులోకి తాజా రక్తం పంపింగ్ కావడానికి ఖాళీ ఏర్పడుతుంది. ఈ ప్రక్రియ వల్ల మెదడులోని విషతుల్యాలు లేదా వ్యర్థాలు తొలగిపోయే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఆవలింతలు ఈ వ్యర్థాలను శుభ్రం చేసి, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయని ఈ పరిశోధన సూచిస్తోంది.

మీ ఆవలింత మీ ‘ఫింగర్ ప్రింట్’

ఈ పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం బయటపడింది. ప్రతి మనిషి ఆవలించే తీరు విభిన్నంగా ఉంటుందట. ఆ సమయంలో మన నాలుక కదిలే తీరు, నోరు తెరిచే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఇది ఎంత ప్రత్యేకంగా ఉంటుందంటే, ఒక వ్యక్తిని అతని ఆవలింత తీరును బట్టి కూడా గుర్తించవచ్చని మార్టినాక్ చెబుతున్నారు. ఇది దాదాపు మన వేలిముద్ర అంత ప్రత్యేకమైనదని ఆయన అభివర్ణించారు.

పెద్ద మెదడు ఉంటే ఎక్కువ ఆవలింతలు!

మీరు ఎక్కువసేపు ఆవలిస్తున్నారా? అయితే అది మీ మెదడు పరిమాణానికి సంకేతం కావచ్చు! సాధారణంగా పెద్ద మెదడు కలిగిన జీవుల్లో ఆవలింత సమయం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. మెదడును చల్లబరచడానికి కూడా ఆవలింతలు ఒక ఏసీ లాగా పనిచేస్తాయని ఒక సిద్ధాంతం ఉంది.

మొత్తం మీద, ఆవలింత అనేది ప్రకృతి మనకు ఇచ్చిన ఒక అద్భుతమైన 'సెల్ఫ్ క్లీనింగ్' ప్రక్రియ అని అర్థమవుతోంది. ఇకపై ఎవరైనా ఆవలింతలు తీస్తుంటే వారు నిద్రపోతున్నారని కాకుండా, వారి మెదడును శుభ్రం చేసుకుంటున్నారని అనుకోవాల్సిందే!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More