రాష్ట్రంలో కొత్తగా డయాలసిస్ కేంద్రాలు.. వైద్యారోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్

తెలంగాణలో మరికొన్ని డయాలసిస్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు వైద్యారోగ్య శాఖలో ఖాళీలను కూడా భర్తీ చేయనున్నట్టుగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అసెంబ్లీలో తెలిపారు.

Published on: Jan 5, 2026, 17:50:30 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థలలో మౌలిక సదుపాయాలు, పరికరాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి చర్యలను వేగవంతం చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ శాసనసభకు తెలియజేశారు. రూ. 58 కోట్ల విలువైన 485 కొత్త వెంటిలేటర్లను కొనుగోలు చేస్తున్నామన్నారు. వాటిని ఫిబ్రవరి నెలాఖరులోగా వివిధ ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. జాతీయ వైద్య మండలి నిబంధనలకు అనుగుణంగా తృతీయ స్థాయి ఆసుపత్రులలో అవసరమైన పరికరాలను ప్రభుత్వం అంచనా వేసిందని, వాటిని కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు.

మంత్రి దామోదర రాజనరసింహ
మంత్రి దామోదర రాజనరసింహ

ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు అంటే మార్చిలోపు ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆరు వేర్వేరు ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి రూ. 192 కోట్ల వ్యయంతో ఎనిమిది కొత్త ఎంఆర్‌ఐ యంత్రాలను కొనుగోలు చేయడానికి చర్యలు ప్రారంభించామని తెలిపారు దామోదర రాజనరసింహ. అదే కాలానికి రూ.60 కోట్ల విలువైన ఎనిమిది సిటి స్కాన్ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

క్యాన్సర్ రోగుల చికిత్స కోసం రూ. 32 కోట్ల విలువైన అదనపు లీనియర్ యాక్సిలరేటర్ (LINAC) యంత్రం, రూ. 8 కోట్ల విలువైన బ్రాకీథెరపీ యంత్రాలను నిమ్స్ కోసం కొనుగోలు చేస్తున్నట్టుగా మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. 2025లో న్యూరోసర్జరీ విభాగంలో రూ. 18 కోట్ల విలువైన పరికరాలను ఏర్పాటు చేశామన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సంస్థలలో 38,000 పడకలు ఉన్నాయని, ఈ ఆసుపత్రులలో అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయడానికి ప్రాధాన్యత ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్య మంత్రి అన్నారు. ఆసుపత్రులపై ఉన్న ఒత్తిడిని బట్టి వివిధ ఆసుపత్రులలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం 15 రకాల పరికరాలను గుర్తించిందన్నారు.

గత రెండేళ్లలో ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో అనేక అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా అత్యవసర ప్రతిస్పందన సమయాన్ని 16 నిమిషాల నుండి 11 నిమిషాలకు తగ్గించిందని మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. ప్రతిస్పందన సమయాన్ని 10 నిమిషాల కంటే తక్కువకు తీసుకురావడానికి అదనపు అంబులెన్స్‌ల కొనుగోలు వంటి చర్యలు ప్రారంభించామన్నారు. అదే సమయంలో 90 శాతం కేసులకు జిల్లా స్థాయిలోనే చికిత్స అందేలా చూడటానికి ప్రభుత్వం రెఫరల్ వ్యవస్థను ప్రోత్సహిస్తోందన్నారు.

రెండు డయాలసిస్ కేంద్రాల మధ్య దూరం 25 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉండేలా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. ప్రస్తుతం పనిచేస్తున్న 105 కేంద్రాలకు అదనంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో మరో 73 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్)లో 213 మంది వైద్యులు, ఇతర సిబ్బందితో సహా 813 పోస్టుల మంజూరు కోసం ఆరోగ్య శాఖ.. ఆర్థిక శాఖ అనుమతి కోరిందని మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More