ఎన్నికల్లో ప్రత్యర్థిగా నిలుచున్నాడని ఇంటిని ట్రాక్టర్‌తో ఢీకొట్టిన కొత్త సర్పంచ్ తమ్ముడు!
తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. అయితే తాజాగా గెలిచిన తర్వాత ఓ కొత్త సర్పంచ్ తమ్ముడు ప్రత్యర్థి ఇంటిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు.
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పోరు అనేక ఘర్షణలకు దారితీస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థులపై దాడులు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో పాత కక్షలు ఈ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బయటకు వస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తమ్ముడు.. బీఆర్ఎస్ మద్దతుదారుడి ఇంటిని ట్రాక్టర్‌తో ఢీ కొట్టాడు.

సోమార్‌పేట్ గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పాపయ్య గెలిచాడు. బీఆర్ఎస్ మద్దతుతారుడు బిట్ల రాజు కూడా గట్టి పోటీని ఇచ్చాడు. తమపై పోటీ చేసినందుకు ట్రాక్టర్‌తో రాజు ఇంటిని కొత్త సర్పంచ్ పాపయ్య తమ్ముడు ఢీకొట్టారని బీఆర్ఎస్ చెబుతోంది. ట్రాక్టర్ తో దాడి చేయడంతో ఇంట్లో ఉన్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయని తెలుస్తోంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. దీంతో సోమార్‌పేట్ గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రామంలో బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగాయి.
సర్పంచుల కోసం లీగల్ సెల్ ఏర్పాటు
రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ, వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బీఆర్‌ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. 'మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం.' అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.
కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్‌ను కాపాడలేకపోయారని కేటీఆర్ అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా భయపడకుండా ప్రజలు, తమ పార్టీ నేతలు నిలబడ్డారని అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీని గెలిపించారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల నెలకొన్న తీవ్రమైన అసంతృప్తికి వ్యతిరేకతకు పంచాయతీరాజ్ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు.
సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. సూర్యాపేట జిల్లాలోని 'ఏపూర్' గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటూ.. అక్కడ చెక్ డ్యాంలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి నిర్మాణాలతో ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందిందని గుర్తుచేశారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే, మనం చేసిన పనే మనకు శ్రీరామరక్ష అని హితవు పలికారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టర్, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు.














