హైదరాబాద్ నగర శివార్లలోని జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్ (గండిపేట), హిమాయత్ సాగర్‌లకు వరద ముప్పు పొంచివుంది. గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ రెండు జలాశయాలకు వరద ప్రవాహాలు మొదలయ్యాయి. ఇన్ ఫ్లో క్రమక్రమంగా పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జలమండలి ఆదివారం ప్రకటన విడుదల చేసింది.

జంట జలాశయాల్లోకి వస్తున్న వరద నీటి పరిమాణాన్ని, ప్రస్తుత నీటి మట్టాలను జలమండలికి చెందిన ప్రత్యేక సాంకేతిక బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. జలాశయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ గేట్లు ఎత్తేందుకు మరియు నీటిని మూసీ నదిలోకి విడుదల చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నారు. వరద తీవ్రత మరింత పెరిగితే ముందస్తు చర్యల కోసం జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, విపత్తు నిర్వహణ విభాగాలు (DRF), స్థానిక సంస్థలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలని జలమండలి సూచించింది.
దిగువ ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు
జలాశయాల గండిపేట, హిమాయత్ సాగర్ దిగువ ప్రాంతాలలో…. ముఖ్యంగా మూసీ నదీ పరివాహక ప్రాంతాల వెంట నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. జలాశయాల క్రస్ట్ గేట్ల నిర్వహణ, నీటి విడుదల లేదా ఇతర అత్యవసర నిర్ణయాలపై ఎప్పటికప్పుడు అధికారిక ప్రకటనల ద్వారా సమాచారం అందజేస్తామని జలమండలి స్పష్టం చేసింది. ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది.
జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి జంట జలాశయాల వరద పరిస్థితిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెండు ప్రాజెక్టుల వద్ద పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు నిరంతరం కనిపెట్టుకుని ఉండాలని ఆదేశించారు. “సంబంధిత అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో అప్రమత్తంగా పనిచేయాలి. దిగువ ప్రాంతాల ప్రజలు అధికారుల సూచనలను ఖచ్చితంగా పాటిస్తూ వరద పరిస్థితిని గమనించాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి” అని ఎండీ అశోక్ రెడ్డి ప్రజలకు సూచించారు.