Inter Permanent Education Number : తెలంగాణ ఇంటర్ సర్టిఫికెట్లపై PEN-పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు
Permanent Education Number : తెలంగాణ ఇంటర్ సర్టిఫికెట్లపై PEN-పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు రానుంది. దీనితో విద్యార్థుల ఎడ్యుకేషన్ జర్నీని ట్రాక్ చేయవచ్చు.
తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న లక్షలాది మంది విద్యార్థుల విద్యా ధ్రువపత్రాల నిర్వహణ, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇంటర్మీడియట్ బోర్డు అత్యంత కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నుంచి విద్యార్థుల మార్కుల సర్టిఫికెట్లపై పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు(PEN - Permanent Education Number) ను ముద్రించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ వెల్లడించారు.

ఈ కొత్త విధానం వల్ల విద్యార్థుల విద్యా ప్రయాణాన్ని సులభంగా ట్రాక్ చేయడమే కాకుండా.. విపత్తుల సమయంలో సర్టిఫికెట్లు పోకుండా డిజిటల్ రూపంలో సురక్షితంగా భద్రపరుచుకునే వెసులుబాటు కలుగుతుంది. పాఠశాల విద్యార్థులకు యూడైజ్ పోర్టల్ ద్వారా కేటాయించే 11 అంకెల విశిష్ట సంఖ్యనే పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబరు (PEN) అని పిలుస్తారు.
పదో తరగతి మార్కుల మేమోలపై ఈ నంబరును ముద్రిస్తున్నారు. ఇంటర్ బోర్డు ఈ పెన్ వివరాలను సమగ్ర శిక్ష విభాగానికి చెందిన డేటాబేస్ నుంచి సేకరిస్తోంది. ఇంటర్మీడియట్ పూర్తి చేశాక విద్యార్థులు ఉన్నత విద్యలో చేరుతున్నారా లేదా మధ్యలోనే చదువు ఆపేశారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఇప్పటివరకు కచ్చితమైన ట్రాకింగ్ వ్యవస్థ లేదు.
విద్యార్థి వేరే రాష్ట్రాలకు వెళ్లి చదువు కొనసాగించినా లేదా చదువుకు స్వస్తి చెప్పినా ఈ 11 అంకెల 'పెన్' నంబరు ఆధారంగా నిమిషాల్లో ట్రాక్ చేయడానికి వీలవుతుంది. లబ్ధిదారులు: రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉన్న సుమారు 9.75 లక్షల మంది విద్యార్థుల ధ్రువపత్రాలపై ఈ నంబరు ముద్రించి రానుంది.
అగ్ని ప్రమాదాలు, భారీ వరదలు లేదా ఇతర ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు పాడైపోవడం లేదా పోగొట్టుకోవడం తరచుగా జరుగుతుంటుంది. ఇటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కారంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల విద్యా పత్రాలను డిజి లాకర్‌లో భద్రపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అపార్(APAAR - Automated Permanent Academic Account Registry) అనే 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టింది.
ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పటికే డిజిలాకర్ ఏజెన్సీతో అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం 82 శాతం నుండి 85 శాతం మంది ఇంటర్ విద్యార్థులకు అపార్ ఐడీ నమోదు పూర్తయిందని, మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలోనే కేటాయింపు పూర్తి చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు.
అపార్ ఐడీ పొందడానికి విద్యార్థులకు తప్పనిసరిగా ఆధార్ నంబరు ఉండాలి. విద్యార్థులు సొంతంగా అపార్ పోర్టల్ ద్వారా ఐడీ పొందవచ్చు లేదా విద్యాసంస్థల ద్వారా దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ వివరాలతో పాటు తల్లిదండ్రుల అంగీకారం తప్పనిసరి.
ఈ అపార్ ఐడీ అందుబాటులోకి రావడం వల్ల విద్యార్థులు తమ ఇంటర్మీడియట్ మార్కుల మేమోలతో పాటు భవిష్యత్తులో పొందే డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను, అలాగే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి కీలక పత్రాలన్నింటినీ డిజిలాకర్‌లో భద్రపరుచుకోవచ్చు. అవసరమైనప్పుడు ఎక్కడి నుంచైనా వీటిని డిజిటల్ రూపంలో అధికారికంగా సమర్పించవచ్చు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


