ETV Win OTT: ఈటీవీ విన్ ఓటీటీలోకి ఇవాళ వచ్చిన బిగ్ బాస్ బాలాదిత్య మూవీ- తండ్రి కోసం పోలీస్ స్టేషన్ ముందు కూతురి ధర్నా!
Oka Chinna Prasna OTT Streaming On ETV Win: ప్రముఖ దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో బిగ్ బాస్ బాలాదిత్య ప్రధాన పాత్రలో నటించిన ఒక చిన్న ప్రశ్న ఓటీటీలోకి ఇవాళ వచ్చేసింది. ఆత్మగౌరవం, కుటుంబ బంధాల చుట్టూ సాగే భావోద్వేగ కథనంగా ఒక చిన్న ప్రశ్న ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వివరాలపై ఇక్కడ లుక్కేద్దాం.
Oka Chinna Prasna OTT Release Today On ETV Win: మధ్యతరగతి జీవితాల ఆవేదన, ఆత్మగౌరవం నేపథ్యంగా తెరకెక్కిన భావోద్వేగ కథనం 'ఒక చిన్న ప్రశ్న'. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ అవార్డు సొంతం చేసుకున్న ప్రముఖ డైరెక్టర్ వేగేశ్న సతీష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

కుటుంబ విలువలు, సామాజిక వ్యత్యాసాలు
ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్లు, యాక్షన్ సినిమాల హడావుడి ఎక్కువవుతున్న ప్రస్తుత తరుణంలో, సామాజిక వ్యత్యాసాలు, కుటుంబ విలువలు, మనుషుల ఆత్మగౌరవాన్ని ప్రశ్నించే కథలు రావడం అరుదుగా మారింది. డైరెక్టర్ వేగేశ్న సతీష్ నిర్మాణం, దర్శకత్వంలో వచ్చిన ఒక చిన్న ప్రశ్న సినిమా సరిగ్గా ఆ లోటును భర్తీ చేస్తూ పాఠకులను, ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగుతుంది.
అసలు కథేంటంటే?
కిరణ్ (బాలాదిత్య) ఆనంద్ ప్రసాద్ అనే ఒక ధనిక వ్యాపారవేత్త వద్ద నమ్మకమైన కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. భార్య (రమ్య పొండూరి), పదో తరగతి చదువుతున్న కూతురు ప్రవల్లిక (బేబీ సహస్ర శ్రీ)తో కలిసి కిరణ్ పరిమిత ఆదాయంతోనే ఎంతో సంతోషంగా జీవిస్తుంటాడు.
తండ్రిని ఎప్పుడూ ఏదీ అడగని ప్రవల్లిక, తన పుట్టినరోజున స్నేహితులను ఇంటికి పిలిచి చిన్న పార్టీ ఇవ్వాలని కోరుతుంది. కూతురి ముచ్చట తీర్చడం కోసం కిరణ్ తన యజమాని ఆనంద్ ప్రసాద్‌ను కొంత డబ్బు అడ్వాన్స్‌గా ఇవ్వమని అడుగుతాడు.
డబ్బు.. ఆత్మగౌరవం మధ్య నలిగే సామాన్యుడు
"డబ్బులేమీ చెట్లకు కాయవు, అడిగినప్పుడల్లా ఇవ్వడానికి నా దగ్గర దండిగ మారి డబ్బుల్లేవు" అంటూ ఆనంద్ ప్రసాద్, కిరణ్ అభ్యర్థనను తోసిపుచ్చడమే కాకుండా అవమానకరంగా మాట్లాడతాడు. సరిగ్గా ప్రవల్లిక పుట్టినరోజు నాడే ఆనంద్ ప్రసాద్ కారులో ఒక వ్యక్తి ఇచ్చిన పెద్ద మొత్తంలో నగదును ఉంచుతాడు.
పండగలాంటి కూతురి పుట్టినరోజును కుటుంబంతో జరుపుకోవడానికి కిరణ్ త్వరగా పని ముగించుకుని ఇంటికి వెళ్తాడు. కానీ, అనుకోకుండా కూతురు పుట్టినరోజు నాడే తండ్రి కిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైళ్లో పెడతారు. దాంతో తన తండ్రి కోసం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతుంది పదోతరగతి చదివే కూతురు.
ధనిక-పేద వ్యత్యాసాలు
ఆ తర్వాత ఆ కారులోని డబ్బు చుట్టూ తిరిగే నాటకీయ పరిణామాలు, కిరణ్ ఎదుర్కొన్న అనుమానాలు, ధనిక-పేద వ్యత్యాసాల మధ్య సాగే ఆత్మగౌరవ పోరాటమే ఈ కథలోని ప్రధానాంశం. అన్యాయాన్ని ఎదిరించి నిలబడే ధైర్యాన్ని, ఆత్మగౌరవ ప్రాముఖ్యతను ఈ చిత్రం ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరించింది.
ఆకట్టుకునే నటన.. సాంకేతిక బలం
డ్రైవర్ పాత్రలో బాలాదిత్య తన సహజ సిద్ధమైన నటనతో ఆకట్టుకోగా, రమ్య పొండూరి, బేబీ సహస్ర శ్రీ, రవివర్మ అద్దూరి, నళిని, సాయి రాజ్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. వెంకటేశ్ బొల్లా అందించిన సంగీతం సన్నివేశాల్లోని గాఢతను పెంచగా, దాము నర్రావుల ఛాయాగ్రహణం, నరేంద్ర కూర్పు కథా గమనానికి అనుగుణంగా సాగాయి.
ఒక చిన్న ప్రశ్న ఓటీటీ స్ట్రీమింగ్
హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు 'ఒక చిన్న ప్రశ్న' మంచి అనుభూతిని అందిస్తుంది. ఇంత మంచి ఎమోషనల్ డ్రామా ఒక చిన్న ప్రశ్న ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్ (ETV Win)లో ఒక చిన్న ప్రశ్న ఓటీటీ రిలీజ్ అయింది.
ఈటీవీ విన్ ఓటీటీ కథా సుధ
ప్రతి వారం విభిన్న కంటెంట్‌తో వచ్చే ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో భాగంగా నేడు అక్టోబర్ 4 నుంచి ఒక చిన్న ప్రశ్న ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 6తో అలరించిన ఒకప్పటి హీరో బాలాదిత్య నటించిన ఈటీవీ విన్ ఓటీటీ సినిమా ఒక చిన్న ప్రశ్న తెలుగు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


