ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు మరోసారి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 1వ తేదీన హైదరాబాద్ లోని ఇంటి చిరునామాలో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నంది నగర్ నివాసంలో ఇంటి గోడకు సిట్ నోటీసులు అతికించారు.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ స్పష్టం చేసింది. సీఆర్పీసీ 160 కింది నోటీసులు అందజేసింది. మరోసారి కేసీఆర్ కు నోటీసులు జారీ అవ్వటం కీలక పరిణామంగా మారింది.
నిజానికి కేసీఆర్ విచారణకు సంబంధించి ఇటీవలనే సీట్ నోటీసులు జారీ అయ్యాయి. జనవరి 30వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉంది. కానీ విచారణకు హాజరు కాలేను అని కేసీఆర్ బదులిచ్చారు. విచారణను రీషెడ్యూల్ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని… విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు.
ఎర్రవల్లిలోనే విచారించాలని కేసీఆర్ కోరినప్పటికీ… తాజాగా జారీ అయిన ఆదేశాల్లో మాత్రం నందినగర్ నివాసంలోనే విచారిస్తామని సిట్ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
మరో వైపు సిట్ నోటీసుల నేపథ్యంలో కేటీఆర్, హారీశ్‌రావు.. కేసీఆర్‌తో సమావేశమయ్యారు. సిట్ నోటీసులపై ఏం చేయాలన్న విషయమై న్యాయవాదుల సలహా మేరకు కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. మరోవైపు కేసీఆర్ కు నోటీసులు ఇవ్వటాన్ని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు.