కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణకు ఆదేశం.. 30డేస్ డెడ్‌లైన్ పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఫామ్ హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అంతేకాదు 30 రోజుల్లో విచారణ చేయాలని చెప్పారు. భూ అక్రమాలపై ఎస్ఈటీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
తెలంగాణ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు చెందిన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌పై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. ఆ ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉందన్న ఆరోపణలపై 30 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఒకవేళ అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నట్లు తేలితే దాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెడతామని అసెంబ్లీలో ప్రకటించారు.

బీఆర్ఎస్ హయాంలో ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని రూ. లక్ష కోట్ల భూ కుంభకోణం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబంతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకుల భూముల వివరాలను ఆయన సభ ముందుంచారు.
'కల్వకుంట్ల కుటుంబానికి 9 జిల్లాల్లోని 24 మండలాల్లో ఉన్న 31 గ్రామాల్లో ఏకంగా 439 ఎకరాల భూములు ఉన్నాయి. ఇందులో కేసీఆర్ కుటుంబానికి సిద్దిపేటలో 67.5 ఎకరాలు, కేటీఆర్ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కవితకు 37 ఎకరాలు, సంతోష్‌రావుకు 79 ఎకరాల చొప్పున భూములు ఉన్నాయి.' అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మాజీ మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సుధీర్ రెడ్డిలు 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఫామ్‌హౌస్‌లోని 50 ఎకరాల్లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఉందని, పైలట్ రోహిత్ రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించుకున్నారని వివరించారు.
రాష్ట్రంలో జరిగిన భారీ భూ కుంభకోణాల గుట్టు రట్టు చేసేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని(SET) ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇప్పటివరకు బయటపెట్టింది ధరణి పార్ట్-1 మాత్రమేనని, త్వరలోనే పార్ట్-2 అక్రమాలను కూడా శాసనసభ వేదికగానే బట్టబయలు చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు తన కళ్లలోకి చూసి మాట్లాడే ధైర్యం లేకే సభను పక్కదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
22ఏ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోందని సీఎం తెలిపారు. సమస్యల పరిష్కారానికి హైపవర్ ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వారం రోజుల్లో సమగ్ర మార్గదర్శకాలు (గైడ్‌లైన్స్) విడుదల చేసి, హెచ్‌ఎండీఏ (HMDA), జీహెచ్‌ఎంసీ (GHMC), డీటీసీపీ (DTCP) లేఔట్ల దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరిస్తామన్నారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో జీఓ 118 కింద ఉన్న 9,500 మంది బాధితులకు త్వరలోనే తీపి కబురు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నిర్దేశిత గడువులోగా అక్కడ పెండింగ్‌లో ఉన్న స్థలాలను క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ప్రవర్తనను సీఎం తప్పుబట్టారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన సభా నిబంధనల ప్రకారమే ప్లకార్డులు, నినాదాల ఫ్లెక్సీలతో రావడాన్ని స్పీకర్ నిషేధించారని, ఆ ఆదేశాలనే పోలీసులు అమలు చేస్తున్నారని వివరించారు. చట్టబద్ధంగా చర్చకు సిద్ధమై పేదలకు మేలు జరిగేలా విపక్షాలు సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


