TG 22A Prohibited Lands : అలా ఉంటే రెండు రోజుల్లోనే పరిష్కారం - 22ఏ భూములపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
Telangana 22A Prohibited Lands Registration : తెలంగాణలో 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల చిక్కులకు చెక్ పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రైవేటు భూములకు 2 రోజుల్లోనే పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.
Telangana 22A Prohibited Lands Registration : రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రజలను వేధిస్తున్న 22-ఏ నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రజల ఆస్తి హక్కులను పరిరక్షించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి నిషేధిత భూముల జాబితా, రిజిస్ట్రేషన్ల అంశంపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. భూ ఆస్తులున్న యజమానులు తమ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రెండు రోజుల్లోనే పరిష్కారం…
రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్‌లైన్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న యజమానుల ఆస్తులు ఒకవేళ 22-ఏ నిషేధిత జాబితాలో కనిపిస్తే, రెవెన్యూ అధికారులు వెంటనే రంగంలోకి దిగుతారు. కేవలం రెండు రోజుల్లోనే ఆ భూమికి సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. సదరు స్థలం లేదా భూమి ప్రైవేటు వ్యక్తులదని తేలితే… ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.
కేవలం తాత్కాలిక ఉపశమనమే కాకుండా, ఈ సమస్యకు శాశ్వత విముక్తి కల్పించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాల పరిధిలోని 22-ఏ జాబితాలో ఉన్న భూములను స్వయంగా, క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ప్రైవేటు భూములు తప్పుగా ఈ నిషేధిత జాబితాలో చేరి ఉంటే వాటిని వెంటనే తొలగించి… ఎలాంటి తప్పులకు ఆస్కారం లేని పక్కా నివేదికను, సరైన జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. ఈ సమగ్ర ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఉపశమనం కలిగించాలని స్పష్టం చేశారు.
దళారులను నమ్మవద్దు…
భూ హక్కుల విషయంలో తెలంగాణ ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. "ప్రజల ఆస్తి హక్కులను కాపాడటానికి మన రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉంది. ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూములకు సంబంధించి ఒక్క అంగుళం స్థలానికి కూడా ఇబ్బంది రానివ్వం" అని సీఎం హామీ ఇచ్చారు.
ఇదే సమయంలో ప్రజలను హెచ్చరించిన ముఖ్యమంత్రి…. 22-ఏ భూముల క్లియరెన్స్ లేదా రిజిస్ట్రేషన్ల పేరుతో దళారులు, మధ్యవర్తులను ఆశ్రయించి మోసపోవద్దని కోరారు. సోషల్ మీడియాలో లేదా బయట ప్రచారంలో ఉండే ఎలాంటి పుకార్లను, కట్టుకథలను విశ్వసించవద్దని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా పనులు జరుగుతాయని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

