ఆదిలాబాద్‌లో అరుదైన ‘బుద్ధ పరినిర్వాణ’ శిల్పం లభ్యం.. చరిత్రకారులు ఏం అంటున్నారు?
ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్సరి గ్రామంలో ఒక రాతి స్తంభంపై అరుదైన బుద్ధ పరినిర్వాణ శిల్పం కనిపించింది. ఇది చాలా అరుదైనదని చరిత్ర కారులు చెబుతున్నారు.
తెలంగాణ చరిత్ర పరిశోధనల్లో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఆదిలాబాద్ జిల్లా భీమ్సరి గ్రామంలో అత్యంత అరుదైన, చారిత్రక ‘బుద్ధ పరినిర్వాణ’ (మహా పరినిర్వాణం చెందుతూ పడుకుని ఉన్న బుద్ధుడు) శిల్పం లభ్యమైంది. ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ సభ్యులు ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, చరిత్ర అధ్యాపకుడు పృథ్విరాజ్ భీమ్సరి గ్రామంలో క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తుండగా ఒక రాతి స్తంభంపై ఈ శిల్పాన్ని గుర్తించారు. ఈ స్తంభానికి నాలుగు వైపులా విభిన్న శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అందులో ఒకవైపు బుద్ధ పరినిర్వాణ శిల్పం అర్ధ శిల్పంగా మలచబడి ఉంది.
ఈ శిల్పాన్ని నిశితంగా పరిశీలించిన చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ మాట్లాడుతూ... "ఈ శిల్పంలో బుద్ధుడు తన కుడిచేతిని తల కింద ఉంచుకుని, కుడివైపునకు తిరిగి పడుకుని ఉన్నాడు. ‘పరినిబ్బాన సుత్త’ గ్రంథంలో వివరించిన బుద్ధ పరినిర్వాణ రూపానికి ఇది అచ్చుగుద్దినట్లు సరిపోలింది." అని పేర్కొన్నారు.
ప్రముఖ శిల్పకారుడు, చరిత్రకారుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కూడా ఈ శిల్పాన్ని పరిశీలించి, ఇది కచ్చితంగా బుద్ధ పరినిర్వాణ శిల్పమేనని ధృవీకరించారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం... తెలంగాణలో ఇప్పటివరకు ఇలాంటి శిల్పాలు కేవలం రెండు చోట్ల మాత్రమే లభించాయి. ఒకటి వేములవాడ భీమేశ్వర ఆలయం దగ్గర ఉండగా, మరొకటి ముదిగొండలో లభించిన తెల్లటి రాతి పలకపై ఉంది. ఇప్పుడు ఆదిలాబాద్‌లో లభించడం మూడోది.
ఈ రాతి స్తంభం మిగిలిన మూడు వైపులా ఇతర మతాలకు సంబంధించిన అద్భుత శిల్పాలు ఉన్నాయి. శేషతల్పంపై పడుకుని ఉన్న విష్ణుమూర్తి, పార్వతీ దేవిని ఆలింగనం చేసుకున్న శివుడి రూపం, రాజసపు దుస్తులు ధరించి, చేతిలో కత్తి పట్టుకున్న ఒక వీరుని విగ్రహం ఉన్నాయి.
ఒకే రాతి స్తంభంపై బౌద్ధ, శైవ, వైష్ణవ సంస్కృతులకు సంబంధించిన శిల్పాలు చెక్కబడి ఉండటం అత్యంత అరుదైన విషయమని, నాటి కాలంలోని మత సామరస్యానికి ఇది సజీవ సాక్ష్యమని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆవిష్కరణ తెలంగాణ బౌద్ధ చరిత్ర పరిశోధనల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


