నేను చనిపోతేనే నిధులు ఇస్తారా..? సొంత ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Jadcherla MLA Anirudh Reddy Comments : జడ్చర్ల నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు, కాంట్రాక్టర్ల బకాయిలు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు.నియోజకవర్గానికి నిధులు సాధించేందుకు చావుకైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు.
Jadcherla MLA Anirudh Reddy : కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే నుంచే తీవ్ర నిరసన ఎదురైంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ శాసనసభ్యుడు అనిరుధ్ రెడ్డి తన నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు విడుదల చేయకపోతే నియోజకవర్గ ప్రజల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు వదలడానికైనా సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

వారికి మాత్రమే నిధులు ఇస్తారా…?
రాజాపూర్ మండల పరిధిలోని రంగారెడ్డిగూడ, గుండ్లపోట్లపల్లి గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రజాప్రతినిధులు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం మంత్రుల ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గాలకే నిధులు మంజూరు చేస్తూ, సాధారణ ఎమ్మెల్యేల నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెంటనే స్పందించి జడ్చర్ల నియోజకవర్గంలో రవాణా సౌకర్యాల కోసం, రోడ్ల నిర్మాణాల పూర్తికి బకాయి పడిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
"నా నియోజకవర్గంలో నిలిచిపోయిన బిల్లులను తక్షణమే మంజూరు చేయాలి. లేదంటే 30,000 మంది ప్రజలతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాను. అనిరుధ్ రెడ్డి చనిపోతేనే నిధులు ఇస్తామంటే.. ఆ దీక్షలోనే చావడానికి సిద్ధంగా ఉన్నాను. నేను చనిపోయాకైనా నా జడ్చర్లకు నిధులు ఇవ్వండి" అని ఆవేదనతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మడి నాగర్కర్నూల్ జిల్లాలో పెండింగ్ బిల్లులు రాక ఒక కాంట్రాక్టర్ మరణించిన ఘటనను అనిరుధ్ రెడ్డి గుర్తుచేశారు. "ఒక కాంట్రాక్టర్ చనిపోతే ఆయనకు రావాల్సిన రూ.5 కోట్ల బిల్లును వెంటనే విడుదల చేశారు. ఇప్పుడు మా నియోజకవర్గానికి సంబంధించి రూ.40 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ రూ.40 కోట్ల విడుదల కోసం నా ప్రాణాలు పోవాలా? నేను బతికి ఉండటం కంటే నా ప్రాణం విలువ రూ.40 కోట్లా కాదా అనేది ప్రభుత్వమే తేల్చుకోవాలి" అని నిలదీశారు.
జడ్చర్ల ప్రాంతంలో వ్యవసాయానికి, తాగునీటికి ఇబ్బంది కలగకుండా ఉద్దండాపూర్ నుంచి కాల్వల నిర్మాణం చేపట్టి ప్రతి గ్రామానికి నీరు అందించాలని అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు విభేదాలు పక్కనబెట్టి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జడ్చర్ల నియోజకవర్గానికి నీళ్లు, నిధులు సాధించే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

