Chepa Prasadam 2026 : మృగశిర కార్తె స్పెషల్ - ఈనెల 8న రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీ, ఉచితంగా సౌకర్యాలు

Chepa Prasadam 2026 : నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జూన్ 8 రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం కానుంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాట్లు సిద్ధం చేసింది.

Published on: Jun 6, 2026, 19:36:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chepa Prasadam 2026 : హైదరాబాద్‌ నగరంలో శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం, ప్రజల నమ్మకమైన మృగశిర కార్తె చేప ప్రసాదం పంపిణీకి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ సిద్ధమవుతోంది. ఈ నెల 8వ తేదీ (జూన్ 8) రాత్రి నుంచి ప్రారంభం కానున్న ఈ భారీ కార్యక్రమానికి సంబంధించి ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

చేప ప్రసాదం (ఫైల్ ఫొటో)
చేప ప్రసాదం (ఫైల్ ఫొటో)

రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి దగ్గరుండి పర్యవేక్షించారు. శనివారం వారు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌ను సందర్శించి, భక్తుల కోసం ఏర్పాటు చేసిన భారీకేడ్లు, క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

సాధారణంగా ప్రతి ఏటా మృగశిర కార్తె ఉదయం పూట ప్రవేశిస్తుంది. కానీ…. ఈసారి జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు కార్తె ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాత్రి పూట వచ్చే ప్రజలకు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుండి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. జూన్ 8 రాత్రి ప్రారంభమై, మరుసటి రోజు అంటే జూన్ 9వ తేదీ అర్ధరాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతుందని…. లైన్లలో ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రసాదం అందేలా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందని స్పష్టం చేశారు.

క్యూలైన్లలో కూలర్లు, నిరంతర విద్యుత్ సరఫరా

ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు, ఉక్కపోత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందువల్ల క్యూ లైన్లలో వేచి ఉండే భక్తుల కోసం ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేయాలని మంత్రులు ఆదేశించారు. ఇవి నిరంతరాయంగా పనిచేసేలా చూడాలని, ఎక్కడా కరెంట్ పోకుండా నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు అత్యవసర బ్యాకప్ కోసం వాటర్‌ప్రూఫ్ జనరేటర్లను సిద్ధంగా ఉంచాలని అధికారులకు సూచించారు. భక్తులకు తాగునీటి కొరత రాకుండా చూడాలని స్పష్టం చేశారు.

క్యూలైన్లలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా భద్రతను, సీసీ కెమెరాల విజువల్స్‌ను నిరంతరం మానిటరింగ్ చేయాలని స్పష్టం చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా గ్రౌండ్స్‌లోని ఎలక్ట్రికల్ వైరింగ్‌ను నిరంతరం తనిఖీ చేయాలని, ముందస్తు జాగ్రత్తగా ఫైర్ ఇంజన్ వాహనాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అంబులెన్సులు, తగినన్ని మందులతో కూడిన వైద్య శిబిరాలను సిద్ధం చేయాలని మంత్రులు ఆదేశించారు. ముఖ్యంగా క్యూలైన్ల మధ్యలో సీపీఆర్ (CPR) నిర్వహించగల ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచాలన్నారు. గ్రౌండ్స్ అంతటా సమాచారం స్పష్టంగా వినిపించేలా క్లియర్ ఆడియోతో కూడిన మైకులను అమర్చాలని చెప్పారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఉన్న కంట్రోల్ రూమ్, ప్రత్యేక వాట్సప్ గ్రూపుల ద్వారా అన్ని విభాగాల అధికారులు సమన్వయం చేసుకుంటూ పంపిణీ ముగిసే వరకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

లక్షా 40 వేల కొరమీను చేప పిల్లలు సిద్ధం

ఈ సందర్భంగా మత్స్య శాఖ మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ…. మృగశిర కార్తె ప్రవేశంతో వాతావరణంలో మార్పులు వస్తాయని, ఎండల తీవ్రత తగ్గి చల్లదనం మొదలవుతుందని చెప్పారు. శ్వాసకోశ సమస్యలు, అస్తమా వ్యాధిగ్రస్తులకు ఈ చేప ప్రసాదం ఒక వరం లాంటిదన్నారు. బత్తిని కుటుంబ సభ్యులు సుమారు 176 సంవత్సరాలుగా ప్రజల నమ్మకం, విశ్వాసాల మేరకు ప్రభుత్వ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని గుర్తుచేశారు. ఈ ఏడాది పంపిణీ కోసం మత్స్య శాఖ ద్వారా సుమారు 1,40,000 నాణ్యమైన కొరమీను చేప పిల్లలను సిద్ధంగా ఉంచినట్లు మంత్రి ప్రకటించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు తాము ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. కులమతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించాలని, 'ఆరోగ్య తెలంగాణ' సాధనే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కూడా స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఉచితంగా అల్పాహారం, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నాయని…. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More