Hyderabad Sanjeevaiah Park Laser Show : హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సంజీవయ్య పార్క్‌లో సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ (TGTDC) సిద్ధమైంది. పార్క్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీమీడియా లేజర్ షో, వాటర్ స్క్రీన్, మ్యూజికల్ ఫౌంటెన్‌లను అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ ఆర్థిక సహాయంతో సుమారు రూ. 49.65 కోట్ల వ్యయంతో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశారు. భాగ్యనగరానికి వచ్చే పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి వినోదాన్ని అందిస్తూ, నగర పర్యాటక రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం.
కన్నుల పండువగా సాగే ఈ మల్టీమీడియా షోలో అద్భుతమైన లేజర్ ప్రొజెక్షన్లు, నీటి తెరలపై (వాటర్ స్క్రీన్) కనిపించే మనోహరమైన దృశ్యాలు, సంగీతానికి అనుగుణంగా నాట్యం చేసే మ్యూజికల్ ఫౌంటెన్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కుటుంబ సమేతంగా వచ్చే సందర్శకులు, పిల్లలు సాయంత్రం వేళల్లో ఆహ్లాదకరమైన వినోదాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన వేదికగా నిలవనుంది.
షో సమయాలు:
- మొదటి షో: సాయంత్రం 7:00 గంటల నుంచి 7:30 గంటల వరకు
- రెండో షో: రాత్రి 8:00 గంటల నుంచి 8:30 గంటల వరకు
ప్రవేశ టికెట్ ధరలు:
- పెద్దలకు: రూ. 150 (ఒక్కొక్కరికి)
- పిల్లలకు (5 నుంచి 12 సంవత్సరాలు): రూ. 120 (ఒక్కొక్కరికి)
హైదరాబాద్ పర్యాటక రంగానికి సరికొత్త శోభను తీసుకువచ్చిన ఈ ప్రత్యేకమైన మల్టీమీడియా లేజర్ షోను వీక్షించి, ఆహ్లాదకరమైన అనుభూతిని పొందాలని పర్యాటకులను, హైదరాబాద్ ప్రజలను తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆహ్వానిస్తోంది. మరిన్ని వివరాల కోసం 9848126947, 9848125720, 9848306435, 8340811234 నెంబర్లను సంప్రదించాలి.