Rohan Naidu : అంతరిక్షంలో అద్భుతాన్ని కనుగొన్న హైదరాబాద్ యువ శాస్త్రవేత్త! ఏంటి ఈ ‘బ్లాక్ హోల్ స్టార్’?

Rohan Naidu black hole star : అంతరిక్షంలో శాస్త్రవేత్తలను విస్మయిస్తున్న బ్లాక్ హోల్ స్టార్​ను హైదరాబాద్‌లో జన్మించిన శాస్త్రవేత్త రోహన్ నాయుడు, అతని బృందం కనుగొంది. సూర్యుడి కంటే కోట్లాది రెట్లు ఎక్కువ కాంతిని వెదజల్లుతున్న ఈ వస్తువు విశ్వ రహస్యాలను ఛేదించడంలో కీలకం అవుతుందని వారు చెబుతున్నారు.

Published on: Aug 17, 2026, 14:01:51 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అంతరిక్ష పరిశోధన రంగంలో భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు! హైదరాబాద్‌లో జన్మించిన ఖగోళ శాస్త్రవేత్త రోహన్ పీ నాయుడు నేతృత్వంలోని సైంటిస్టుల బృందం అంతరిక్షంలో అత్యంత రహస్యమైన, వింతైన వస్తువును కనుగొంది. దీనిని వారు 'బ్లాక్ హోల్ స్టార్'గా పిలుస్తున్నారు. ఈ పరిశోధనకు సంబంధించిన కీలక వివరాలతో కూడిన పత్రం.. ప్రముఖ సైన్స్ జర్నల్ 'నేచర్'లో ఇటీవలే ప్రచురితమైంది.

రోహన్ నాయుడు.. (MIT)
రోహన్ నాయుడు.. (MIT)

అంతరిక్షంలో నక్షత్రాల మాదిరిగా కనిపిస్తూ, అసలు నక్షత్రాలు కాని 'లిటిల్ రెడ్ డాట్స్' గురించిన పరిశోధనలో భాగంగా ఈ కొత్త రహస్యం వెలుగు చూసింది. ఈ అద్భుత ఆవిష్కరణ గురించి రోహన్ నాయుడు వివరిస్తూ, “ఇది చూడటానికి నక్షత్రంలాగే ఉంటుంది, కానీ సాధారణ నక్షత్రం కంటే వంద బిలియన్ల రెట్లు ఎక్కువ కాంతిని వెదజల్లుతోంది,” అని పేర్కొన్నారు.

మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)తో పాటు పలు సంస్థల ఖగోళ శాస్త్రవేత్తలు విశ్వంలో ఈ అత్యంత ప్రకాశవంతమైన ఎరుపు రంగు చుక్కను గుర్తించారు. మన సౌర కుటుంబ పరిమాణంలో ఉన్న ఈ భారీ వస్తువు.. ఏ సాధారణ నక్షత్రం కూడా భౌతికంగా ఉత్పత్తి చేయలేని విధంగా, "మామూలు నక్షత్రం కంటే వంద బిలియన్ల రెట్లు అధిక శక్తిని" విడుదల చేస్తోంది. అసలు ఈ స్థాయి శక్తి కేవలం బ్లాక్ హోల్స్ నుంచి మాత్రమే విడుదలయ్యే అవకాశం ఉందని పరిశోధనా నివేదిక స్పష్టం చేసింది.

ఏంటి ఈ 'బ్లాక్ హోల్ స్టార్'?

ఈ వింత వస్తువుకు శాస్త్రవేత్తలు 'MoM-BH*-1' అని పేరు పెట్టారు. ఇది ఒక బ్లాక్ హోల్, అలాగే ఒక భారీ నక్షత్రం కలయికగా భావిస్తున్నారు! అంతరిక్ష చిత్రాల్లో తరచుగా కనిపించే 'లిటిల్ రెడ్ డాట్స్' రహస్యాన్ని ఇది ఛేదించగలదని పరిశోధకులు నమ్ముతున్నారు.

ఈ అద్భుత వస్తువు గురించి రోహన్ నాయుడు మాట్లాడుతూ.. "దీని గురించి మా అంచనాలు వేగంగా మారుతున్నాయి. సూర్యుడి కంటే లక్ష రెట్లు ద్రవ్యరాశి కలిగిన ఒక సెంట్రల్ బ్లాక్ హోల్ దీని మధ్యలో ఉంటుందని మేము భావిస్తున్నాము. ఈ బ్లాక్ హోల్ చుట్టూ సౌర కుటుంబ పరిమాణంలో నక్షత్రంలా కనిపించే భారీ వాయువుల ఆవరణ ఉంది," అని వివరించారు.

మహా విస్ఫోటం (బిగ్ బ్యాంగ్) జరిగిన 660 మిలియన్ సంవత్సరాల తర్వాతే ఈ వింత ఎరుపు రంగు వస్తువు ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

ఎవరు ఈ రోహన్ నాయుడు?

హైదరాబాద్‌లో జన్మించిన రోహన్ నాయుడు ప్రస్తుతం ఎంఐటీ కవ్లి ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిక్స్ అండ్ స్పేస్ రీసెర్చ్‌లో నాసా హబుల్ ఫెలోగా, పాపలార్డో ఫిజిక్స్ ఫెలోగా కొనసాగుతున్నారు.

అతని విద్యా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. 18 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే ఆపేసి, మొదటిసారి విమాన టికెట్ కొనుగోలు చేసి సింగపూర్‌లోని యేల్-ఎన్‌యూఎస్ కాలేజీలో చేరారు. ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఖగోళ శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టా పొందారు. ప్రస్తుతం హవాయ్ విశ్వవిద్యాలయంలోని ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆస్ట్రోఫిజిఎస్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఖగోళ శాస్త్రంతో పాటు ఆయనకు క్విజ్ పోటీలు, కవితలు రాయడం, టెస్ట్ క్రికెట్ చూడటం అంటే ఎంతో మక్కువ.

ఈ ఆవిష్కరణ వెనుక కథ..

ఎంఐటీ నివేదిక ప్రకారం.. రోహన్ నాయుడు, ఆయన సహచరులు మొదట ఈ బ్లాక్ హోల్ స్టార్‌ను కనుగొనాలని భావించలేదు. వారు 'మిరేజ్ ఆర్ మిరాకిల్' (ఎంఓఎం) అనే సర్వేలో భాగంగా అత్యంత దూరంగా ఉన్న, తొలి కాలపు గెలాక్సీల కోసం అన్వేషిస్తున్నారు. విశ్వం కొన్ని వందల మిలియన్ సంవత్సరాల వయసులో ఉన్న కాలం నాటి దృశ్యాలను పరిశీలించడానికి నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్​ను ఉపయోగించారు.

టెలిస్కోప్ అందించిన చిత్రాలను పరిశీలిస్తున్న సమయంలో ఒక ప్రత్యేకమైన ఎరుపు రంగు ప్రకాశవంతమైన చుక్క వారి దృష్టిని ఆకర్షించింది. ఆ చుక్క వెలుతురు కొన్ని నిర్దిష్ట తరంగదైర్ఘ్యాల (వేవ్​లెన్త్) వద్ద పూర్తిగా అదృశ్యం కావడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా, ఆ ఎరుపు రంగు చుక్క కాంతిలో హైడ్రోజన్, హీలియం మినహా ఇతర లోహాల ఆనవాళ్లు ఏ మాత్రం లేవు.

దీని మూలాలను పరిశోధించిన శాస్త్రవేత్తలు చివరకు ఇది ఒక 'బ్లాక్ హోల్ స్టార్' అని నిర్ధారించారు. సౌర కుటుంబ పరిమాణంలో ఉన్న హైడ్రోజన్ వాయువుల కోశం మధ్యలో సూర్యుడి కంటే లక్ష రెట్లు ద్రవ్యరాశి ఉన్న బ్లాక్ హోల్ దీని కేంద్రంలో ఉందని వారు గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతాలను కనుగొనడానికి ఇది మొదటి అడుగుగా నిలుస్తుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More