Saraswathi Pushkaralu 2026 : కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు - ఈనెల 21 నుంచి ప్రారంభం - 40 లక్షల మంది భక్తుల కోసం భా
Saraswathi Pushkaralu 2026: మే 21 నుంచి కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి.దాదాపు 40 లక్షల మంది హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొదటి రోజు శ్రీ జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి, రాష్ట్ర గవర్నర్ పుణ్య స్నానాలు ఆచరిస్తారు.
kaleshwaram Saraswathi Pushkaralu 2026 : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సరస్వతీ అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పుష్కరాలకు దాదాపు 30 నుంచి 40 లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులను కల్పించనున్నట్లు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆధ్వర్యంలో పుష్కరాల ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో దేవాదాయ, విద్యుత్, పోలీస్, రవాణా, వైద్య ఆరోగ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కంచి స్వామీజీ చేతుల మీదుగా ప్రారంభం…
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ... వివరాలను వెల్లడించారు. మే 21వ తేదీ ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి పుష్కర ఘాట్ వద్ద పుణ్యస్నానం ఆచరించి ఈ అంత్య పుష్కరాలను అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. పుష్కరాల ప్రారంభోత్సవంలో కంచి స్వామీజీతో పాటు రాష్ట్ర గవర్నర్ కూడా పాల్గొని పవిత్ర స్నానాలు ఆచరిస్తారని పేర్కొన్నారు. ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చే భక్తుల కోసం కాళేశ్వరం ఆలయంలో ప్రత్యేక దర్శన లైన్లు, వివిధ పీఠాధిపతులకు ప్రోటోకాల్ వసతులు, ఘాట్ల వద్ద నిరంతర పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ మరియు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
మేడారం జాతర స్ఫూర్తితో నిర్వహణ..
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ... ఇటీవల తాము విజయవంతంగా పూర్తి చేసిన మేడారం జాతర స్ఫూర్తితోనే ఈ సరస్వతీ అంత్య పుష్కరాలను కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని నమ్మకం వ్యక్తం చేశారు. పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు ప్రతి రోజు ఒక ప్రముఖ పీఠానికి చెందిన స్వామీజీలు పాల్గొని పుణ్యస్నానాలు చేస్తారని వివరించారు.
భక్తుల కోసం ఉదయం వేళల్లో పవిత్ర హోమాలు, సాయంత్రం వేళల్లో ఘాట్ వద్ద వైభవంగా హారతి, తెప్పోత్సవంతో పాటు భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అంత్య పుష్కరాల అనుభవం భవిష్యత్తులో రాబోయే మహా గోదావరి పుష్కరాల నిర్వహణకు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె పేర్కొన్నారు.
శాఖల వారీగా బాధ్యతలు…
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.... గత చరిత్రతో పోలిస్తే పుష్కరాలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగిందని గుర్తు చేశారు. 2012లో జరిగిన సరస్వతి పుష్కరాలకు కేవలం 2 లక్షల మంది రాగా, గత ఏడాది జరిగిన ఆది పుష్కరాలకు ఏకంగా 40 లక్షల మంది భక్తులు వచ్చారని గుర్తు చేశారు. ఈసారి కూడా అదే స్థాయిలో జనసమీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భక్తుల కోసం ప్రత్యేకంగా ఒక నూతన మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు వివిధ శాఖల సమన్వయ విధులను వివరించారు. భక్తుల వసతి కోసం తిరుమల తరహాలో 100 గదుల చౌల్ట్రీ, ఘాట్ల వద్ద తాత్కాలిక టెంట్ హౌస్‌లు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ సిద్ధం చేస్తున్నారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక బస్ స్టేషన్లను నిర్మించి, నిరంతరాయంగా షటిల్ బస్సులను నడపనున్నారు.
తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా శాఖ చూసుకుంటుంది. వైద్య ఆరోగ్య శాఖ 12 రోజుల పాటు నిరంతరం పనిచేసేలా ప్రత్యేక వైద్య శిబిరాలు, అత్యవసర మందులు మరియు అంబులెన్స్ బృందాలను రంగంలోకి దించుతోంది. పోలీస్ శాఖ తరఫున భారీ పార్కింగ్ స్థలాలు, రూట్ మ్యాప్‌లు, వాచ్ టవర్లు, సీసీటీవీ కెమెరాల నిఘా మరియు నిరంతర వై-ఫై, మొబైల్ కనెక్టివిటీ కోసం చర్యలు చేపట్టారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

