సింగరేణి కార్మికులకు దసరా ధమాకా.. బోనస్ రూ.1.51 లక్షలు ప్రకటన.. కాంట్రాక్ట్ ఉద్యోగులకూ లబ్ధి!

Singareni Bonus : సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ దసరా కానుకను ప్రకటించింది. ఈ ఏడాది సేకరించిన నికర లాభాల్లో 34 శాతం వాటాను లాభాల బోనస్‌గా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ప్రతీ కార్మికుడికి సగటున రూ.1,51,912 అందనుంది.

Published on: Oct 13, 2026, 14:08:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బొగ్గు గని కార్మికుల ముఖాల్లో వెలుగులు నింపుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు దసరా పండుగ కానుకగా ప్రొఫిట్ షేరింగ్(లాభాల్లో వాటా) బోనస్‌ను ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సాధించిన లాభాల్లో 34 శాతాన్ని కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.

సింగరేణి కార్మికులకు బోనస్
సింగరేణి కార్మికులకు బోనస్

ఈ నిర్ణయంతో సింగరేణిలో పనిచేస్తున్న ప్రతీ పర్మనెంట్ కార్మికుడికి రూ.1,51,912 బోనస్ రూపంలో అందనుంది. గతంతో పోలిస్తే ఇది అత్యధిక బోనస్. కేవలం పర్మనెంట్ ఉద్యోగులకే కాకుండా, కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు కూడా దసరా కానుకగా రూ.5,500 బోనస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పండుగకు ముందే ఈ డబ్బులు కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.

సింగరేణి సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1,754 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఇందులో 34 శాతం వాటాను అనగా దాదాపు రూ.596 కోట్లను కార్మికులకు పంపిణీ చేయనున్నారు. బొగ్గు ఉత్పత్తి పెంచడంలో, సంస్థను లాభాల బాటలో నడిపించడంలో రాత్రింబవళ్లు శ్రమించే కార్మికుల హక్కులను గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

సింగరేణి కార్మికుల సంక్షేమానికి సంబంధించి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో డిప్యూటీ సీఎం పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న 300 కారుణ్య నియామకాల ప్రక్రియను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగ విరమణ చేసిన లేదా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల ఆధారపడిన కుటుంబ సభ్యులకు త్వరలోనే ఉద్యోగ నియామక పత్రాలు అందజేస్తామన్నారు.

కార్మికుల నివాస వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. బొగ్గు గనుల తవ్వకాలు లేని, పర్యావరణపరంగా సురక్షితమైన ప్రాంతాలలో సింగరేణి కార్మికుల కోసం సమగ్ర ఆధునిక సౌకర్యాలతో కూడిన మోడల్ హౌసింగ్ కాలనీలు నిర్మించాలని నిర్ణయించారు. తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పార్కులు, వినోద కేంద్రాలతో ఈ కాలనీలను అభివృద్ధి చేయనున్నారు.

ప్రభుత్వ ప్రకటనతో కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి, మందమర్రి, గోదావరిఖని, భూపాలపల్లి ఏరియాల్లో కార్మికుల సంబరాలు మెుదలయ్యాయి. పండుగ వేళ ఇంత పెద్ద మొత్తంలో బోనస్ రావడం వల్ల కార్మికుల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది. సింగరేణి సంస్థను మరింత లాభాల బాటలో పయనించేలా చేయడం మరియు కార్మికుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More