హైదరాబాద్ నుంచి ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ అందించింది. కాచిగూడ - అశోకాపురం - కాచిగూడ (రైలు నంబర్లు 12785 / 12786) డైలీ ఎక్స్‌ప్రెస్ వేళలను వేగవంతం చేయాలని భావించినప్పటికీ… మునుపటి ప్రతిపాదనను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. సాంకేతిక, నిర్వహణ పరమైన కారణాల రీత్యా ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ రైలు మునుపటి సమయాల్లోనే యథావిధిగా నడుస్తుందని వెల్లడించింది.
ట్రైన్ టైమింగ్స్ వివరాలు…

గతంలో ప్రతిపాదించిన సమయ మార్పులు అమలులోకి రావు. 2026 ఆగస్టు 25 నుంచి కాచిగూడ నుంచి, అలాగే 2026 ఆగస్టు 26 నుంచి అశోకాపురం నుంచి అమలు చేయాలని భావించిన కొత్త వేళల ప్రకటనను పూర్తిగా వెనక్కి తీసుకున్నారు. ప్రయాణికులు పాత సమయాలనే గమనించాలని అధికారులు సూచించారు.
- కాచిగూడ - అశోకాపురం ఎక్స్‌ప్రెస్ (Train No. 12785) : ఈ రైలు ప్రతిరోజూ సాయంత్రం 07:05 గంటలకు కాచిగూడ స్టేషన్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 09:55 గంటలకు అశోకాపురం(కర్ణాటక) చేరుకుంటుంది.
- అశోకాపురం - కాచిగూడ ఎక్స్‌ప్రెస్ (Train No. 12786 ) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ప్రతిరోజూ మధ్యాహ్నం 02:55 గంటలకు అశోకాపురంలో బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 05:40 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
కాచిగూడలో బయలుదేరిన తర్వాత ఈ రైలు మహబూబ్‌నగర్, కర్నూలు, అనంతపురం, బెంగళూరు మార్గంలో ప్రయాణించి మైసూర్ సమీపంలోని అశోకాపురం చేరుకుంటుంది. అయితే మార్గమధ్యంలో ఉన్న అన్ని స్టేషన్లలోనూ రాకపోకలు, నిలుపుదల సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకోవాలని కోరారు.