సింగరేణి నుంచి శుభవార్త - జాబ్ లో చేరేందుకు వారికి మరో అవకాశం! అర్హతలివే!
2023-2025 మధ్య విధులకు గైర్హాజరై ఉద్యోగాలు కోల్పోయిన సింగరేణి కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు యాజమాన్యం నిర్ణయించింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
సింగరేణి సంస్థలో ఉద్యోగాలు కోల్పోయిన మాజీ కార్మికులకు సంస్థ యాజమాన్యం తీపి కబురు అందించింది. 2023 నుంచి 2025 మధ్య కాలంలో వివిధ కారణాల వల్ల విధులకు గైర్హాజరై, ఉద్యోగాల నుంచి తొలగింపునకు గురైన మాజీ ఉద్యోగుల కేసులను పునఃపరిశీలించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బాధితులకు మరో అవకాశం కల్పిస్తూ వారిని తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఒక ప్రత్యేక హైపవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇటీవల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కోల్ బెల్ట్ ప్రాంత ప్రజాప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో ఉద్యోగాలు కోల్పోయిన డిస్మిస్డ్ ఉద్యోగులను మానవీయ కోణంలో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు.
ప్రజాప్రతినిధుల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం…. ఈ అంశాన్ని వెంటనే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో 2023 నుంచి 2025 వరకు గైర్హాజరు వల్ల తొలగించబడిన ఉద్యోగులకు పునఃనియామకం కల్పించేందుకు యాజమాన్యం మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంత?
సింగరేణి యాజమాన్యం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం 01.01.2023 నుంచి 31.12.2025 మధ్య కాలంలో విధులకు హాజరు కాకపోవడంతో ఉద్యోగం కోల్పోయిన వారు మాత్రమే ఈ అవకాశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు 01.04.2026 నాటికి 46 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు కలిగి ఉండాలి.
- ఉద్యోగం నుంచి తొలగించబడిన కాలానికి ముందున్న 5 క్యాలెండర్ సంవత్సరాలలో, ఏవైనా 2 సంవత్సరాలలో కనీసం 100 మస్టర్లు తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి.
- జనరల్ అసిస్టెంట్ ట్రైనీ (UG) లేదా కేటగిరీ-I పోస్టులో పునఃనియామకం పొందేందుకు అభ్యర్థులు శారీరకంగా, వైద్యపరంగా పూర్తి ఫిట్‌గా ఉండాలి.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకునే అర్హత కలిగిన డిస్మిస్డ్ ఉద్యోగులు నిర్ణీత ప్రొఫార్మాలో దరఖాస్తును పూర్తి చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తు పత్రాలను తాము చివరగా పనిచేసిన గని లేదా డిపార్ట్మెంట్ అధిపతికి నేరుగా సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తులను సమర్పించడానికి 2026 నవంబర్ 14ని చివరి తేదీగా సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఏరియా జనరల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హులైన అభ్యర్థుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి…. తదుపరి చర్యల కోసం నిర్ణీత గడువులోగా సంబంధిత అధికారులకు పంపాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తి వివరాలు, అనుమానాల నివృత్తి కోసం సంబంధిత గనులు లేదా విభాగాధిపతులను సంప్రదించాలని సంస్థ కోరింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

