Diwali Bonus 2026 : సింగరేణి కార్మికులకు మరో తీపి కబురు - నవంబర్ 5న దీపావళి బోనస్! ఈసారి ఎంతంటే…?
సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.419 కోట్ల దీపావళి బోనస్‌ను ప్రకటించింది. నవంబర్ 5న ప్రతీ కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 లభించనుండగా… నెల వ్యవధిలోనే రూ.1,020 కోట్ల బోనస్ చెల్లిస్తున్నారు.
ఇటీవలనే లాభాల వాటా (దసరా) బోనస్ అందుకొని ఆనందంలో ఉన్న సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం మరో భారీ తీపి కబురు అందించింది. దీపావళి పండుగ కానుకగా పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ (దీపావళి) బోనస్‌ను నవంబర్ 5వ తేదీన చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి కార్మికులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఆయన…. నవంబర్ 5 నాటికి బోనస్ సొమ్మును కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు.

రూ.419 కోట్ల దీపావళి బోనస్
ఈసారి దీపావళి బోనస్ కింద సింగరేణి యాజమాన్యం మొత్తం రూ.419 కోట్లను చెల్లించనుంది. దీనిద్వారా అర్హులైన ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చొప్పున లభిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు.
"రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి, విస్తరణకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తోంది. ఈ నెలలోనే లాభాల వాటా కింద దాదాపు రూ.600 కోట్లు చెల్లించగా, ఇప్పుడు మరో రూ.419 కోట్ల దీపావళి బోనస్ అందిస్తున్నాం. బొగ్గు రంగంలో రాబోయే పోటీని తట్టుకునేందుకు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేలా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి" అని భట్టి విక్రమార్క కోరారు.
మంత్రి ఆదేశాల అనంతరం సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంస్థ పర్సనల్, ఫైనాన్స్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. నవంబర్ 5న నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోనే బోనస్ జమ అయ్యేలా పక్కా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఎవరికి వర్తిస్తుంది…? అర్హతలు ఇవే…
ఈ దీపావళి బోనస్ కేవలం నేషనల్ కోల్ వేజ్ అగ్రిమెంట్ (NCWA) కింద పనిచేసే గుర్తింపు పొందిన కార్మికులకు మాత్రమే వర్తిస్తుంది. అధికారులకు ఈ బోనస్ వర్తించదు. మొత్తం మీద సంస్థలోని సుమారు 38,000 మంది ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు.
- గరిష్ట బోనస్ : అర్హులైన కార్మికుడికి సగటున గరిష్టంగా రూ.1,10,250 లభిస్తుంది.
- భూగర్భ గనుల విభాగం : గత ఆర్థిక సంవత్సరంలో కనీసం 190 పని దినాలు పూర్తి చేసిన వారికి పూర్తిస్థాయి బోనస్ అందుతుంది.
- ఓపెన్ కాస్ట్, సర్ఫేస్ విభాగాలు : గత ఆర్థిక సంవత్సరంలో 240 పని దినాలు పూర్తి చేసిన వారికి పూర్తిస్థాయి బోనస్ ఇస్తారు.
- తక్కువ హాజరు ఉన్నవారికి : నిర్ణీత పని దినాల కంటే తక్కువ హాజరు ఉన్నవారికి వారు పనిచేసిన రోజుల నిష్పత్తి (ప్రపోర్షనేట్) ప్రకారం బోనస్ లెక్కించి చెల్లిస్తారు.
- కనీస అర్హత : ఈ బోనస్ పొందడానికి గత ఆర్థిక సంవత్సరంలో ఏ కార్మికుడైనా కనీసం 30 రోజులు పనిచేసి ఉండడం తప్పనిసరి.
దసరా, దీపావళి పండుగల పురస్కరించుకుని కేవలం నెల రోజుల వ్యవధిలోనే సింగరేణి కార్మికులు సగటున దాదాపు రూ.2,65,000 చొప్పున అందుకోబోతున్నారు. ఈ రెండు బోనస్‌ల ద్వారా సింగరేణి యాజమాన్యం మొత్తం సుమారు రూ.1,020 కోట్ల భారీ మొత్తాన్ని కార్మికుల సంక్షేమం కోసం వెచ్చించింది.
ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అందిన బోనస్ సొమ్మును అనవసర ఖర్చులు చేయకుండా కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని, వీలైనంత వరకు పొదుపు చేసుకోవాలని హితవు చెప్పారు. పండుగల ఉత్సాహంతో గనులు, వివిధ శాఖల వారీగా కేటాయించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు ఉద్యోగులందరూ పునరంకితం కావాలని కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

