...
...
Next Story

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మీదుగా కాన్పూర్ సెంట్రల్ - మధురై మధ్య స్పెషల్ ట్రైన్స్

South central railway Special Trains : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. కాన్పూర్ సెంట్రల్ - మధురై మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి వరంగల్, విజయవాడ మీదుగా నడుస్తాయి.

Published on: Aug 29, 2026, 08:49:53 IST
Advertisement

పండుగల వేళ, ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కాన్పూర్ సెంట్రల్, మధురై స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లు తెలంగాణలోని వరంగల్, ఏపీలోని విజయవాడ మార్గం గుండా ప్రయాణిస్తాయి.

దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్
దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్

కాన్పూర్ సెంట్రల్ – మధురై ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01925) ప్రతి బుధవారం ఉదయం 08:10 గంటలకు కాన్పూర్ సెంట్రల్‌లో బయలుదేరి, శుక్రవారం ఉదయం 07:15 గంటలకు మధురై చేరుకుంటుంది. 02 సెప్టెంబర్ 2026 నుండి 25 నవంబర్ 2026 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

మధురై – కాన్పూర్ సెంట్రల్ ప్రత్యేక రైలు (రైలు సంఖ్య: 01926) ప్రతి శనివారం అర్ధరాత్రి దాటాక 02:30 గంటలకు మధురైలో బయలుదేరి, సోమవారం ఉదయం 04:30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. 05 సెప్టెంబర్ 2026 నుండి 28 నవంబర్ 2026 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

ఈ ప్రత్యేక రైళ్లు ఇరువైపులా ప్రయాణించే క్రమంలో అనేక కీలక స్టేషన్లలో ఆగనున్నాయి. పోఖ్రాయాన్, ఒరాయ్, వీరాంగన లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బలార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నామక్కల్, కరూర్, దిండిగల్ స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు.

పండుగలు, సెలవుల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, అనధికార ప్రయాణాలను అరికట్టడానికి దక్షిణ మధ్య రైల్వే చర్యలు తీసుకుంటోంది. నిజమైన ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మూడు రోజులు జోనల్ స్థాయిలో విస్తృతమైన టికెట్ తనిఖీ డ్రైవ్‌ను నిర్వహించింది.

దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధి మొత్తం మీద టికెట్ చెకింగ్ చేశారు. ఈ తనిఖీ సమయంలో టికెట్ లేకుండా ప్రయాణించే ప్రయాణికులు, క్రమరహితంగా ప్రయాణించేవారు, బుక్ చేయని లగేజీని తీసుకువెళ్లే ప్రయాణికులకు జరిమానా విధించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేసే ప్రయాణికులు, రైల్వే ప్రాంగణంలో చెత్త వేసేవారు, అనధికారిక వ్యాపారులకు కూడా జరిమానా విధించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

ఈ డ్రైవ్‌లో భాగంగా టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తున్న / క్రమరహితంగా ప్రయాణిస్తున్న 13,964 మంది ప్రయాణికులను, బుక్ చేయని లగేజీని తీసుకువెళ్తున్న 1,189 మంది ప్రయాణికులను గుర్తించారు. టిక్కెట్టు తనిఖీ ద్వారా రూ.1.28 కోట్ల ఆదాయాన్ని రాబట్టారు. ఇది కాకుండా రైల్వే ప్రాంగణంలో చెత్త వేస్తున్న 37 మంది ప్రయాణికులను గుర్తించి రూ.6400 జరిమానా విధించారు. ఇంకా 5 మంది అనధికారిక వీధి వ్యాపారులను గుర్తించి రూ.10,000 జరిమానా విధించారు. రైల్వే ప్రాంగణంలో ధూమపానం చేస్తున్న 7 మంది ప్రయాణికులను గుర్తించి రూ.14,000 జరిమానా విధించారు.

ఈ డ్రైవ్ సందర్భంగా టిక్కెట్ తనిఖీ సిబ్బంది సరైన టిక్కెట్లతో ప్రయాణించడం ప్రాముఖ్యత గురించి ప్రయాణికులకు సలహా ఇచ్చారు. వివిధ ఉల్లంఘనలకు విధించే జరిమానాల గురించి కూడా అవగాహన కల్పించారు. రైళ్లలో, రైల్వే ప్రాంగణాలలో ధూమపానం చేయడం వల్ల కలిగే అగ్ని ప్రమాదాల గురించి కూడా ప్రయాణికులకు తెలియజేశారు. ప్రయాణికులు సరైన, చెల్లుబాటు అయ్యే టిక్కెట్లతో ప్రయాణించాలని , టిక్కెట్ తనిఖీ సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు. రైల్వే నియమాలను పాటించాలని, పరిశుభ్రతను పాటించాలని దక్షిణ మధ్య రైల్వే విజ్ఞప్తి చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks