Ex Maoist Devji : 40 ఏళ్ల తర్వాత మళ్లీ చదువు.... లాయర్ కావడమే లక్ష్యం..! మాజీ మావోయిస్ట్ 'దేవ్‌జీ' కొత్త ప్రస్థానం

Ex Maoist leader Tippiri Tirupati : దశాబ్దాల పాటు అజ్ఞాతంలో గడిపి… ఇటీవల జనజీవన స్రవంతిలో కలిసిన  మావోయిస్ట్(మాజీ) అగ్రనేత తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తన విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. లా విద్యను అభ్యసించి… ఆ రంగంలో పని చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

Published on: May 7, 2026, 18:27:43 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ex Maoist leader Tippiri Tirupati : కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మావోయిస్ట్ నాయకుడు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారు. సుమారు నాలుగు దశాబ్దాల పాటు అడవి బాట పట్టిన ఆయన…. ఇటీవలే తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన అసంపూర్ణ విద్యాభ్యాసాన్ని మళ్లీ మొదలుపెట్టాలని, ముఖ్యంగా న్యాయశాస్త్రం అభ్యసించాలని ఆయన సంకల్పించారు.

మావోయిస్ట్ అగ్రనేత 'దేవ్‌జీ' (HT_PRINT)
మావోయిస్ట్ అగ్రనేత 'దేవ్‌జీ' (HT_PRINT)

గురువారం పీటీఐ (PTI) వార్తా సంస్థతో మాట్లాడిన తిరుపతి…. తన భవిష్యత్తు ప్రణాళికలను పంచుకున్నారు. "నేను 1980వ దశకంలో ఇంటర్మీడియట్ (12వ తరగతి) చదువుతుండగానే అజ్ఞాతంలోకి వెళ్లాను. ఇప్పుడు మళ్లీ చదువుకోవడానికి ఉన్న నిబంధనలు ఏమిటో తెలుసుకుంటాను. భవిష్యత్తులో చట్టబద్ధమైన వ్యవస్థలో ఉండి పని చేయాలంటే…. చట్టాలపై లోతైన అవగాహన అవసరమని భావిస్తున్నాను. అందుకే లా(న్యాయ విద్య) చదవాలని నిర్ణయించుకున్నాను" అని ఆయన వివరించారు.

అడవి బాట నుంచి బహిరంగ జీవితం వరకు..

కరీంనగర్ సమీపంలోని కోరుట్ల నివాసి అయిన తిరుపతి… విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1980లలో అజ్ఞాతంలోకి వెళ్లారు. అప్పట్లో సీపీఐ (మావోయిస్ట్) మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి వంటి నేతల సిద్ధాంతాల ప్రభావంతో విద్యాభ్యాసాన్ని మధ్యలోనే ఆపేసి విప్లవ బాట పట్టారు. మావోయిస్ట్ పార్టీలో అత్యున్నత విభాగాలైన పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహించారు.

ప్రస్తుత సామాజిక పరిస్థితులపై స్పందిస్తూ, దేశంలో మధ్యతరగతి వర్గం విస్తరించినప్పటికీ నిరుద్యోగం, పేదరికం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని తిరుపతి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల ఉద్యోగాల్లో కోత పడుతుండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఫిబ్రవరిలో పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆయన… దీనిని 'జనజీవన స్రవంతి' లో కలవడంగా భావించడం లేదని చెప్పారు. "మేము అజ్ఞాతంలో ఉన్నప్పుడూ ప్రజల మధ్యే ఉండి వారి సమస్యల కోసం పనిచేశాం. ఇప్పుడు మేము చేస్తున్నది మా 'బహిరంగ జీవితాన్ని' పునఃప్రారంభించడం మాత్రమే," అని ఆయన స్పష్టం చేశారు.

రాజకీయాల్లోకి రావడంపై తనకు ఆసక్తి లేదని తేల్చిచెప్పిన తిరుపతి…. మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వానికి ఒక విన్నపం చేశారు. సీపీఐ (మావోయిస్ట్) పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసి, దానిని ఒక రాజకీయ పార్టీగా గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల రాజకీయాల్లో ఆ పార్టీ పాల్గొనకపోయినప్పటికీ…. ఆ గుర్తింపు అవసరమని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ అజ్ఞాత వాసం తర్వాత తన స్వగ్రామంలో ప్రశాంతంగా గడుపుతున్న దేవ్‌జీ…. ఇప్పుడు మళ్లీ పుస్తకాలు పట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More