తెలంగాణలో జన్మించడం, ఇక్కడే జీవించడం ఒక వరంగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అవసరమైన సౌకర్యాలను కల్పిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి భద్రత కల్పించే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించిందన్నారు.

'ఒక కుటుంబంలో సంపాదించే వ్యక్తి అకస్మాత్తుగా మరణిస్తే.. ఆ కుటుంబం అనుభవించే మానసిక వేదన ఒక ఎత్తు కాగా, వారు ఎదుర్కొనే ఆర్థిక సంక్షోభం మరొక ఎత్తు. కేవలం ఒక్క దుర్ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసే ప్రమాదం ఉంది. తెలంగాణ బిడ్డలెవరూ అటువంటి భయం, అభద్రతా భావంతో జీవించకూడదన్నదే ఈ ప్రభుత్వ సంకల్పం.' అని భట్టి విక్రమార్క అన్నారు.
ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం, ప్రపంచంలోని ఏ అభివృద్ధి చెందిన దేశంలో కూడా సాధ్యం కాని రీతిలో, మునుపెన్నడూ లేని విధంగా ఒక గొప్ప జీవిత బీమా పథకాన్ని ప్రారంభిస్తోందని ఆర్థిక మంత్రి భట్టి అన్నారు. సామాజిక విభజనలకు అతీతంగా, పేద, మధ్యతరగతి, ధనిక అనే భేదం లేకుండా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున జీవిత బీమాను అందించేందుకు ప్రభుత్వం 2026 జూన్ 2 నుంచి “ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని” కొత్తగా ప్రవేశపెడుతోందన్నారు.
బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ.. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ప్రభుత్వం దీనిని సిద్ధం చేసిందని, ప్రజలపై అదనపు భారం మోపకుండా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగేలా చూసుకుందని అన్నారు. ఈ బడ్జెట్ సంక్షేమ పథకాలు, గృహనిర్మాణం, నీటిపారుదల, సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించడంతో పాటు, యువత, విద్య, కుటుంబ భద్రత కోసం కొత్త కార్యక్రమాలను కూడా ప్రకటించింది.
- బడ్జెట్‌లో పలు కొత్త పథకాలను తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వర్గాల యువతలో స్వయం ఉపాధిని ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందించే రాజీవ్ యువ వికాసం పథకానికి ప్రభుత్వం రూ. 6,000 కోట్లు కూడా కేటాయించింది.
- ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించడం, హాస్టల్ వంటశాలల ఆధునీకరణకు రూ. 100 కోట్లు కేటాయింపులు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ. 1,000 కోట్లతో సహా మౌలిక సదుపాయాల సహాయాన్ని బడ్జెట్‌లో ప్రకటించింది.
- ప్రభుత్వం గోదావరి పుష్కరాలు-2027కు రూ.500 కోట్లు, పర్యాటకానికి రూ. 1,224 కోట్లు, పరిశ్రమలకు రూ. 3,490 కోట్లు, మహిళా శిశు సంక్షేమానికి రూ. 3,143 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించింది.
- ఐటీఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు రూ.2 వేల ఉపకారవేతం ఇవ్వనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి స్పష్టం చేశారు.
- మరోవైపు రాష్ట్రంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ విద్యార్థుల దాకా అందరికీ బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాలను 2026-27 విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. దివ్యాంగ, శారీరక వైకల్య విద్యార్థులకు రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్‌డ్ వాహనాల పంపిణీ చేస్తామని పేర్కొన్నారు భట్టి.