Telangana Cabinet Decisions 2026 : రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 2 లక్షల 50 వేల మంది పేద కుటుంబాల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది.

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందించనుంది. అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ క్యాబినెట్ తీర్మానించింది. ఈ వివరాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.
తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ రెండు నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు జరుగుతాయి. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులందరూ అక్కడికి వెళ్లి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
- హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (LIG) లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది.
- తెలంగాణ రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఆ కుటుంబాలన్నింటికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని రాష్ట్ర క్యాబినెట్ తీర్మానించింది. గుడిసెలు లేని ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని క్యాబినెట్ నిర్ణయించింది.
- వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జులై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు సంబంధించి వివిధ పనులు చేపట్టేందుకు రూ.1000 కోట్ల నిధులకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేసేందుకు ఆమోదముద్ర.
- ప్రభుత్వం పాఠశాలలతో పాటు అన్ని జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకూ ఉదయం అల్పాహారంతో పాటు పాలు అందించాలని నిర్ణయించింది.
- రాష్ట్రంలోని DCMSలను మార్క్ ఫెడ్లో విలీనం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. TGRICని (తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) హాకాలో విలినం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది.
- పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌లలో ఒకటిగా నిలబెట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. అందుకే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.