ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం - సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గడిచిన రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.
రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలతో పాటు ప్రైవేటు రంగంలో కూడా ప్రపంచంతో పోటీ పడే విధంగా యువతను తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతామని వెల్లడించారు.

హైదరాబాద్ శిల్పకళా వేదికలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 25 శాఖలకు సంబంధించిన గ్రూప్–3లో ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను లాంఛనంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. కొత్తగా ఎంపికైన ఉద్యోగులు రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ - ముఖ్యమైన పాయింట్లు
- “పరిపాలనలో ప్రక్షాళన జరగాలంటే సంపూర్ణంగా సహకరించాలి. కొత్తగా చేరిన వారంతా చిత్తశుద్ధితో పనిచేయాలి. దేశంలోనే అత్యధికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదగాలంటే మీరంతా కష్టపడి పనిచేయాలి. తలవంచకుండా, 30 నుంచి 35 సంవత్సరాల పాటు తెలంగాణ కోసం తల ఎత్తుకుని పనిచేశానని గర్వంగా చెప్పుకునేలా పని చేయాలి.
- ఉద్యోగం ఒక భావోద్వేగం. ఈ భావోద్వేగం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మిమ్మల్ని భాగస్వాములను చేస్తుంది. తద్వారా తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దగలం. 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే బాధ్యతను మీరు తీసుకోబోతున్నారు.
- తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఉద్యోగ నియామకాలు జరుగుతాయని ప్రజలు భావించారు. అయితే 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు ఉద్యోగ నియామకాలు జరగలేదు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో 14 సంవత్సరాల పాటు గ్రూప్–I నియామకాలు కూడా చేపట్టలేదు.
- ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసి దేశంలోనే గొప్ప ఘనత సాధించాం. గడిచిన రెండేళ్లలో 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను పూర్తిగా ప్రక్షాళన చేశాం. గ్రూప్–I, II, III, IV నియామకాలను ఒక యజ్ఞంలా భావించి చేపట్టాం.
- ప్రస్తుత పరిస్థితుల్లో విద్య అన్ని ప్రాంతాలకు వ్యాపించినప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 16.5 లక్షల మంది విద్యార్థులు చదువుతుంటే, 11 వేల ప్రైవేటు పాఠశాలల్లో 33 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు.
- ప్రభుత్వ పాఠశాలల్లో 1.20 లక్షల మంది అర్హత కలిగిన ఉపాధ్యాయులు పనిచేస్తున్నప్పటికీ ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడిందో అందరూ ఆలోచించాలి. కారణాలను మనమే విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన విద్యను అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
- నాణ్యమైన విద్య, అవసరమైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల అంతర్జాతీయ అవకాశాలు ఉన్నప్పటికీ వాటిని అందిపుచ్చుకోలేని పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో మాదిరిగా పేదలకు ఇవ్వడానికి ప్రభుత్వానికి భూములు లేవు. నాణ్యమైన విద్యను అందించాల్సిన అవసరం ఉంది. జీవితంలో మార్పు తీసుకొచ్చేది విద్య ఒక్కటే. చదువే జీవితానికి గౌరవాన్ని తీసుకొస్తుంది.
- స్వాతంత్య్రం సాధించిన వందేళ్ల నాటికి భారత్ ప్రపంచంలోనే అతి బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. తెలంగాణ 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న వారంతా 2047 నాటికీ ప్రభుత్వ సేవల్లో కొనసాగుతారు.
- పేదవారు మీ వద్దకు వచ్చినప్పుడు, మీ సొంత తల్లిదండ్రులు వచ్చినట్లే స్పందించాలి. తల్లిదండ్రులను గౌరవంగా చూసుకోని వారు ఎవరైనా ఉంటే, వారి జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించి ఆ మొత్తాన్ని తల్లిదండ్రుల ఖాతాలో జమ చేస్తాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
మరోవైపు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో కూడా పర్యటించారు. బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం, నిర్మల్‌లో ATC ఏర్పాటు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తాగు, సాగునీటి కోసం తుమ్మిడిహెట్టి వద్ద చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం, జిల్లాలో కొత్తగా అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి ప్రణాళికలను వెల్లడించారు.
- “తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్‌లో జరగాల్సినంత అభివృద్ధి, జిల్లాకు రావలసిన నీరు రాలేదు. పాలమూరు జిల్లాకు ఏ మేరకు ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేసుకుంటున్నామో అదే తరహాలో ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేస్తాం.
- చనాక – కొరాట బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి గారి పేరును, సదర్మట్ బ్యారేజీకి స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి గారి పేరును పెడుతున్నాం. నీటి పారుదల శాఖ మంత్రి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలి.
- పదేళ్ల పాటు చనాకా – కొరాట పూర్తి చేయలేదు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. నిర్మల్ లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తాం.
- ఎన్నికల సమయంలో రాజకీయాలు. ఇప్పుడు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం కలిసిమెలిసి పనిచేద్దాం. ఎర్రబస్సు కూడా రావడం లేదని చెబుతున్న పరిస్థితి నుంచి ఎయిర్ బస్సు వచ్చేలా ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకుందాం.
- రాష్ట్రానికి సంబంధించి అనుమతులు, నిధుల కోసం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కేంద్ర మంత్రులను ఎలాగైతే కలుస్తున్నామో, అదే తరహాలో పార్టీలకు అతీతంగా రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం ప్రజాప్రతినిధులు రావాలి.
- ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో, ఆ మరుసటి రోజు అధికార యంత్రాంగంతో జిల్లా ఇంచార్జీ మంత్రి సమీక్ష నిర్వహించి నివేదిక సమర్పించాలి. ఆ నివేదికపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి బడ్జెట్ సమావేశాల్లో అనుమతులు మంజూరు చేస్తాం.
- తుమ్మిడిహెట్టి వద్ద గతంలో ప్రతిపాదిత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతాం. అందుకు డీపీఆర్ సిద్ధమవుతోంది. తుమ్మిడిహెట్టి కట్టాలంటే మహారాష్ట్ర నుంచి కొన్ని అనుమతులు తీసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక మాట చెబితే మన ప్రాంతానికి మేలు జరుగుతుంది. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తాం" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

E-Paper












