Telangana EAGLE Force : సింథటిక్ డ్రగ్స్ తయారీ ముఠా గుట్టురట్టు - తీగ లాగితే... డొంక కదిలింది!
సింథటిక్ డ్రగ్స్ తయారీ ముఠాను తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మారేగవ్లో రహస్య ల్యాబ్‌లో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అంతర్రాష్ట్ర సింథటిక్ డ్రగ్స్ తయారీ, సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించారు.
డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా తెలంగాణ ఈగల్ ఫోర్స్ దూకుడు పెంచింది. అంతర్రాష్ట్ర సరిహద్దులు దాటి విస్తరించిన డేంజరస్ సింథటిక్ డ్రగ్స్ తయారీ స్థావరాన్ని, దాని వెనుకున్న అక్రమ నెట్‌వర్క్‌ను చేధించింది. మహారాష్ట్రలోని గోండియా జిల్లా మహారాజ్గాం గ్రామంలో గల ఒక కోడి ఫామ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న రసాయన డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని బట్టబయలు చేసింది.

11 మంది అరెస్ట్….
ఈ కేసులో మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా, ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో 13 మంది పరారీలో ఉన్నారు. కారు తనిఖీతో వెలుగులోకి వచ్చిన దందాలో కీలక విషయాలు వెలుగు చూశాయి.
యాదాద్రి భువనగిరి జిల్లా కొండమడుగు నుంచి నాగపూర్ వైపు అతివేగంగా వెళ్తున్న ఒక తెల్లటి ఎస్యూవీ (SUV) వాహనాన్ని బీబీనగర్ పోలీసులు దారిమధ్యలో అడ్డుకున్నారు. కార్లలో తనిఖీలు చేపట్టగా దాదాపు 27.2 కిలోల ప్రమాదకర మెఫెడ్రోన్ డ్రగ్, అలాగే తయారీకి ఉపయోగించే 56.98 కిలోల ఎసిటోన్ రసాయనం భారీగా లభించాయి. వాహనంలో ప్రయాణిస్తున్న చేతన్ మధుకర్ మేష్రామ్, ముజమ్మిల్ హక్, ఆకాష్ అశోక్ గవాండేలను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు.
బీబీనగర్ పోలీస్ స్టేషన్లో ఎన్డీపీఎస్ (NDPS) చట్టం ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ వ్యవహారం వెనుక అంతర్రాష్ట్ర మూలాలు, లాజిస్టికల్ నెట్వర్క్ ఉన్నట్లు ప్రాథమికంగా ఆధారాలు లభించడంతో ఈ కేసు దర్యాప్తును ఈగిల్ ఫోర్స్‌కు అప్పగించారు.
తెలంగాణ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన నెట్వర్క్ఈగిల్ ఫోర్స్ రంగంలోకి దిగి లోతుగా విచారణ జరపగా కంగుతినే నిజాలు బయటపడ్డాయి. రసాయనాల సరఫరాదారులు, ల్యాబ్ నిర్వాహకులు, పరికరాల దళారులు మరియు డ్రగ్స్ పంపిణీదారులు ఒకరికొకరు ముడిపడి ఒక సిండికేట్‌గా పనిచేస్తున్నట్లు తేలింది.
తెలంగాణలోని కొండమడుగులో ఉన్న వేటుకూరి ల్యాబ్స్, హైదరాబాద్ మౌలాలీలోని ఎస్ఎమ్ ల్యాబ్స్లకు ఈ అక్రమ రసాయనాల దందాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రొపియోనైల్ క్లోరైడ్ వంటి ముడి రసాయనాలను అక్రమంగా సేకరించడం, వాటిని వేరే ప్రదేశాలకు మళ్లించడం, మెఫెడ్రోన్, ఆల్ ప్రాజోలామ్, ఎఫెడ్రిన్ వంటి నిరోధిత డ్రగ్స్‌ను రహస్యంగా తయారీ చేయడం వెనుక పెద్ద రాకెట్ ఉన్నట్లు స్పష్టమైంది.
అక్టోబర్ 17న దాడులు.. పట్టుబడిన కీలక సూత్రధారి
కేసు దర్యాప్తులో అక్టోబర్ 17వ తేదీన కీలక మలుపు తిరిగింది. ఈగిల్ ఫోర్స్ బృందం మహారాష్ట్రలోని గోండియా జిల్లా తిరోడా తాలూకా మారేగాం గ్రామంలోని సర్వే నంబరు 92/2లో ఉన్న ఒక కోడి ఫామ్‌పై దాడి చేసింది. అక్కడ పౌల్ట్రీ ఫామ్ ముసుగులో డ్రగ్స్ తయారు చేస్తున్న రహస్య కర్మాగారాన్ని అధికారులు కనుగొన్నారు. అక్కడ రసాయనాలను ప్రాసెస్ చేసే అత్యాధునిక యంత్రాలు, డ్రగ్స్ తయారీ అవశేషాలు లభించాయి. వెంటనే స్థానిక తిరోడా పోలీసులకు సమాచారం ఇవ్వగా, మహారాష్ట్ర పోలీసులు ప్రత్యేకంగా కేసు నమోదు చేశారు.
అదే రోజు ఈగిల్ ఫోర్స్ బృందం మహారాష్ట్ర వసాయ్‌లోని 'జెఎస్వి గ్లోబల్స్' యజమాని జైరాజ్ కృష్ణ శెట్టిని అరెస్టు చేసింది. డ్రగ్స్ తయారీకి ప్రధానమైన ప్రొపియోనైల్ క్లోరైడ్ రసాయనాన్ని చేతన్ మేష్రామ్ ముఠాకు ఇతడే సరఫరా చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. శెట్టిని తెలంగాణకు తరలించి అరెస్ట్ నమోదు చేశారు.
ఈ విచారణలో కొండమడుగు వేటుకూరి ల్యాబ్స్ యజమాని పెనుమత్స రాకేష్ వర్మ పేరు కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఇతడిని జూలై 23, 2026న ఇండోర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారులు మరొక కేసులో ఇప్పటికే అరెస్టు చేయగా, ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా జైలులో ఉన్నాడు.
రసాయనాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యంత్రాలను ఎవరు సమకూర్చారు? ఈ ముఠా వెనుక ఉన్న ఆర్థిక మూలాలు మరియు హవాలా మార్గాలు ఏమిటి? అనే కోణంలో ఈగిల్ ఫోర్స్ దర్యాప్తును తీవ్రతరం చేసింది. రాష్ట్రంలో మాదకద్రవ్యాల తయారీ, రవాణాను ఉపేక్షించేది లేదని, ఇతర రాష్ట్రాల ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ డ్రగ్స్ రహిత తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేస్తామని ఈగిల్ ఫోర్స్ స్పష్టం చేసింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

