భవన నిర్మాణాలకు ఊరట: ఫైర్ ఎన్‌ఓసీ నిబంధనల్లో తెలంగాణ అగ్నిమాపక శాఖ కీలక మార్పులు

తెలంగాణలో ప్రొవిజనల్ ఫైర్ ఎన్‌ఓసీల జారీకి సంబంధించి అగ్నిమాపక శాఖ కీలక మార్పులు చేసింది. నివాస సముదాయాల ఎత్తు పరిమితి పెంపుతో పాటు బిల్డర్లకు సులభతర నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published on: Oct 9, 2026, 19:15:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హైదరాబాద్: రాష్ట్రంలో భవనాల భద్రత, నిర్మాణ రంగానికి ఊరటనిచ్చేలా తెలంగాణ ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ అండ్ సివిల్ డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ ప్రొవిజనల్ ఫైర్ అభ్యంతరం లేని పత్రాల (ఎన్‌ఓసీ) జారీ నిబంధనలను సవరించింది. అగ్నిప్రమాదాల నివారణ మరియు ప్రాణరక్షణ చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తూనే, అనుమతుల ప్రక్రియను సరళతరం చేయడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులు తీసుకొచ్చారు.

భవన నిర్మాణాలకు ఊరట: ఫైర్ ఎన్‌ఓసీ నిబంధనల్లో తెలంగాణ అగ్నిమాపక శాఖ కీలక మార్పులు
భవన నిర్మాణాలకు ఊరట: ఫైర్ ఎన్‌ఓసీ నిబంధనల్లో తెలంగాణ అగ్నిమాపక శాఖ కీలక మార్పులు

నిర్మాణ రంగానికి స్పష్టమైన మార్గదర్శకాలు

అగ్నిమాపక సేవల శాఖ డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ ఈ మేరకు నూతన మార్గదర్శకాలను విడుదల చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన క్రెడాయ్ (CREDAI), తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ ప్రతినిధులతో నిర్వహించిన విస్తృత సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ 7 నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అక్టోబర్ 7 లేదా ఆ తర్వాత అందిన కొత్త ప్రొవిజనల్ ఫైర్ ఎన్‌ఓసీ దరఖాస్తులకు మాత్రమే ఇవి వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

నూతన నిబంధనల్లో ప్రధాన మార్పులు ఇవే..

మార్గదర్శకాల ప్రకారం నివాస భవనాలకు సంబంధించిన ఫైర్ ఎన్‌ఓసీ నిబంధనల్లో ప్రధాన సవరణలు చేశారు.

ఎత్తు పరిమితి పెంపు: గతంలో 18 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న నివాస అపార్ట్‌మెంట్లకు ఫైర్ ఎన్‌ఓసీ తప్పనిసరిగా ఉండేది. ప్రస్తుత సవరణల ప్రకారం ఈ పరిమితిని 24 మీటర్లకు పెంచారు. ఇతర రకాల భవన నిర్మాణాలకు పాత నిబంధనలే కొనసాగుతాయి.

ఫైర్ టవర్: భవనం రకంతో సంబంధం లేకుండా 24 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తు ఉండే ప్రతి నిర్మాణానికి 'ఫైర్ టవర్' ఏర్పాటు చేయడం తప్పనిసరి.

ఫైర్ కమాండ్ సెంటర్: 24 మీటర్లు అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న అన్ని రకాల భవనాల్లోనూ 'ఫైర్ కమాండ్ సెంటర్' గదిని నిర్మించాలి.

డీజిల్ జెనరేటర్ గదుల వెంటిలేషన్: బేస్‌మెంట్లలో ఉండే డీజిల్ జెనరేటర్ (డీజీ) గదుల వెంటిలేషన్ కోసం కనీసం ఒక మీటరు ఎత్తు ఉన్న ఫైర్ రేటెడ్ గోడ పైన లూవర్లను (Louvres) ఏర్పాటు చేయడానికి అనుమతించారు. అయితే ఆ గోడకు కనీసం రెండు గంటల పాటు మంటలను తట్టుకునే (2-hour Fire Resistance rating) సామర్థ్యం ఉండాలి.

అనుమతుల ప్రక్రియ వేగవంతం

రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణాల్లో అగ్నిప్రమాద నివారణ, ప్రాణరక్షణ చర్యలు పక్కాగా అమలుకావడంతో పాటు అనుమతుల జారీలో సరళమైన విధానాన్ని తీసుకురావడమే ఈ సవరణల ముఖ్య ఉద్దేశమని అగ్నిమాపక శాఖ వెల్లడించింది. దీనివల్ల భవన నిర్మాణదారులకు స్పష్టమైన, ఏకరూప మార్గదర్శకాలు అందుబాటులోకి రానున్నాయి.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More