...
...
Next Story

Telangana : రెండో వాహనం కొనాలనుకుంటున్నారా..? మీకోసమే ఈ గుడ్ న్యూస్

రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసేవారికి ప్రభుత్వం తీపికబురు చెప్పేందుకు సిద్ధమవుతోంది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలనే నిర్ణయానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.

Published on: Feb 6, 2026, 10:31:19 IST
Advertisement

రవాణాశాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం… మరో నిర్ణయంపై కసరత్తు చేస్తోంది. రెండో వాహనం కొనుగోలు చేసేవారికి 2 శాతం అదనపు ట్యాక్స్‌ను రద్దు చేయాలని యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన దస్త్రం… సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికారికంగా త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

సీఎం గ్రీన్ సిగ్నల్… త్వరలో ఉత్తర్వులు…!

రెండో వాహనం కొనుగోలుపై 2 శాతం ట్యాక్స్ రద్దు...! (image source Pixabay)
రెండో వాహనం కొనుగోలుపై 2 శాతం ట్యాక్స్ రద్దు...! (image source Pixabay)

సాధారణంగా ఒక వ్యక్తికి ఓ వాహనం ఉన్న తర్వాత… మరో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్సాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటోంది. అయితే ఈ ట్యాక్స్ ను రద్దు చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అధికారికంగా ఉత్తర్వులు జారీ అయితే వాహనదారులకు మరో ఊరట దక్కినట్లే అవుతుంది.

రవాణశాఖ గణాంకాల ప్రకారం….. రాష్ట్రంలో ఏటా సగటున 7 లక్షల కొత్త ద్విచక్రవాహనాలు, రెండున్నర లక్షలకుపైగా కార్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వీటిల్లో 1.91 లక్షల వరకు రెండో వాహనాల కేటగిరి కిందనే ఉంటున్నారు. వీరంతా కూడా 2 శాతం అదనపు లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారు. ఫలితంగా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. పలు సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం… ఈ తరహా ట్యాక్స్ ను ఎత్తివేయాలని భావిస్తోంది. ఈ నిర్ణయానికి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా… త్వరలోనే ఉత్తర్వులు వస్తాయని సమాచారం.

ట్యాక్స్ రద్దు చేయటానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. చాలా మంది వాహనదారులు ఈ ట్యాక్స్ ను తప్పించుకునేందుకు వారి ఇంట్లోని కుటుంబ సభ్యుల పేర్లపై వాహనాలను రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. తరువాత బీమా క్లెయిమ్‌ల సమయంలో యాజమాన్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదే విషయాన్ని రవాణా శాఖ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లింది.

ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తున్నవారు డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నారు. ఈ నిర్ణయం గత నెల 23 నుంచే అమల్లోకి వచ్చింది. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్‌) డీలర్‌ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో…. ప్రస్తుతం షోరూమ్ డీలర్ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం ఉండదు.

వాహనాన్ని విక్రయించిన డీలరే….. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్‌ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.

కొత్త సంస్కరణల అమలు నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌, క్యూ లైన్‌లో వెయిటింగ్‌, కార్డు కోసం తిప్పలు తప్పినట్లు అయింది. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు మాత్రం ఇప్పటి వరకు అమల్లో ఉన్నట్టుగానే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe