...
...
Next Story

యూనివర్సిటీల్లో 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణ వర్సిటీల్లో 450కి పైగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబంధించి వేగంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జీఓ 21 సవరణలతో త్వరలో నోటిఫికేషన్ రానుంది.

Published on: Oct 1, 2026, 09:26:23 IST
Advertisement

తెలంగాణలో ఉన్న 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా జీఓ 21 ప్రాతిపదికన వర్సిటీ స్థాయిలోనే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

కాకతీయ వర్శిటీ
కాకతీయ వర్శిటీ

వర్సిటీ నియామకాలపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్ సమక్షంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ముగ్గురు వర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఈ భేటీలో పాల్గొన్నారు.

గతంలో జారీ చేసిన జీఓ 21 విధానంలో కొన్ని సవరణలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూజీసీ మార్గదర్శకాలకు భిన్నంగా జీఓ 21లో పీహెచ్‌డీ అభ్యర్థులకు ఇచ్చే వెయిటేజీ మార్కులను తగ్గించారనే విమర్శలు రావడంపై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా మార్పులు చేసి, త్వరితగతిన కొత్త ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ అధికారులను సీఎమ్‌ఓ ఆదేశించింది.

విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ల నియామకంపై గతంలో న్యాయపరమైన చిక్కులు, పాలనాపరమైన ప్రతిష్టంభనలు ఏర్పడ్డాయి. గవర్నింగ్ బాడీలు లేకపోవడం కూడా చిక్కుగా మారింది. నియామకాలను ఆమోదించేందుకు యూనివర్సిటీల్లో సరైన పాలకమండళ్లు అందుబాటులో లేవు. కొన్ని దశాబ్దాలుగా సేవలు అందిస్తున్న కాంట్రాక్ట్ సహాయ ఆచార్యులు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, సర్వీస్ వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

నియామకాలను టీజీపీఎస్సీ ద్వారా చేపట్టాలనే ఆలోచన వచ్చినా.. న్యాయపరమైన అడ్డంకులు రాకూడదనే ఉద్దేశంతో వర్సిటీల వారీగానే భర్తీ ప్రక్రియ చేపడుతున్నారు. ప్రభుత్వం తొలుత కాంట్రాక్ట్ అధ్యాపకుల స్థానాలకు ఎలాంటి విఘాతం కలగకుండా సుమారు 450 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని ప్రాథమికంగా భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఖాళీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

యూజీసీ 2018 నిబంధనల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సంబంధిత సబ్జెక్టులో పీజీ (55 శాతం మార్కులతో) + NET / SLET / SET అర్హత లేదా Ph.D ఉండాలి. గ్రాడ్యుయేషన్, పీజీ, ఎంఫిల్, పీహెచ్‌డీ, రీసెర్చ్ పబ్లికేషన్స్, టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా మార్కులు కేటాయిస్తారు. సవరించిన జీఓ 21 ప్రకారం అకడమిక్ పాయింట్లు ప్లస్ ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks