...
...
Next Story

తెరపైకి జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ - మార్పులుంటాయా..?

రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, చేర్పుల అంశం తెరపైకి వస్తోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఉన్నతస్థాయి కమిషన్‌ను నియమించేందుకు సిద్ధమైంది. ఇదే విషయంపై సీఎం రేవంత్ కూడా ఇటీవలే ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాల విషయంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

Published on: Jan 16, 2026, 12:28:29 IST
Advertisement

రాష్ట్రంలో జిల్లాలు, మండలాల పునర్‌వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో 10 జిల్లాలు ఉండగా… బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ముందుగా 31 జిల్లాలను ఏర్పాటు చేయగా… ఆ తర్వాత మరో 2 జిల్లాలపై కూడా నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం 33 జిల్లాలున్నాయి. రెవెన్యూ మండలాల సంఖ్య కూడా 612కి చేరగా… రెవెన్యూ డివిజన్లు 74కు చేరాయి.

జిల్లాలపై కసరత్తు
జిల్లాలపై కసరత్తు

ఇక బీఆర్ఎస్ హయాంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో అనేక డిమాండ్లు వచ్చాయి. వాటిలో కొన్నింటిని పరిగణనలోకి తీసుకున్న నాటి ప్రభుత్వం…. అందుకు అనుగుణంగా ఉత్తర్వులను కూడా జారీ చేసింది. అయితే నాటి ప్రభుత్వ నిర్ణయంతో కొన్ని జిల్లాల స్వరూపమే మారిపోయిందన్న విమర్శలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల విషయంలో ఈ విమర్శలున్నాయి.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అయితే కొద్దిరోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటు, పాత వాటిలో మార్పు చేర్పులు వంటి వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి అనేక కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా…. ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఓ ప్రకటన చేశారు. మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వవస్థీకరణపై వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో వాటిపై సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్‌ను కూడా నియమిస్తామని ప్రకటించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిషన్ వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో పర్యటించి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తరహాలోనే అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుందన్నారు. ఆ కమిషన్ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టి సమగ్రంగా చర్చించిన తర్వాత రేషనలైజేషన్‌కు సంబందించి మార్గదర్శకాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు.

సీఎం ప్రకటనకు అనుగుణంగా…. కమిషన్ ఏర్పాటు చేస్తే మాత్రం కొన్ని జిల్లాల స్వరూపంలో మార్పులుండొచ్చనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ములుగు, సిద్ధిపేట, హన్మకొండ, వరంగల్, రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల పరిధిలోని కొన్ని గ్రామాలు అటు ఇటు కావొచ్చనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు ఇచ్చే సూచనలు, విజ్ఞప్తులను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకునే ఛాన్స్ ఉంది.

జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఏవిధంగా ఉంటుందనే దానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ప్రస్తుతం ఉన్న జిల్లాలను కుదిస్తే… బీఆర్ఎస్ తరపున గట్టిగా పోరాడుతామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేశారు…!

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks