తెలంగాణలో భారీగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల ధరలు.. జూన్ నుండి జనాలపై భారం!
తెలంగాణ ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను సవరించడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఆస్తి రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల్లో ఆస్తి రిజిస్ట్రేషన్ రుసుములు భారీగా పెరిగే అవకాశం ఉంది. క్యూఆర్ పరిధిలోని ప్రాంతాల్లో భూముల మార్కెట్ విలువలను సవరించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతున్న సమయంలో ఈ వార్త కూడా వైరల్ అవుతోంది.

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాల్లో భూముల ప్రభుత్వ మార్కెట్ విలువలను 15 శాతం నుండి 30 శాతం వరకు పెంచాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కొత్త ధరలు జూన్ నెల నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ మూడు జిల్లాల్లో ప్రతి నెలా సుమారు 40,000 నుండి 50,000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరుగుతుంటాయి. ధరలు 15 శాతం పెరిగితే కొనుగోలుదారులపై నెలకు రూ.150 కోట్ల నుండి రూ.180 కోట్ల అదనపు భారం పడుతుంది. అదే 30 శాతం పెరిగితే, ఈ భారం నెలకు ఏకంగా రూ.300 కోట్ల నుండి రూ.360 కోట్లకు చేరుకుంటుంది.
ఐటీ హబ్‌లు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిసరాలు, వాణిజ్య సముదాయాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గచ్చిబౌలి, కొండాపూర్, నానక్‌రామ్‌గూడ, ఖాజాగూడ, మియాపూర్, రాయదుర్గం, మాదాపూర్, ఫిలింనగర్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాలలో ధరలు భారీగా మారనున్నాయి. కొన్ని ప్రీమియం ప్రాంతాలలో ప్రభుత్వ భూమి విలువ గజానికి రూ.1 లక్ష దాటే అవకాశం ఉంది.
ప్రభుత్వ మార్కెట్ విలువ పెరిగినప్పుడు.. దానికి అనుగుణంగా మనం కట్టే స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ, మరియు రిజిస్ట్రేషన్ ఫీజులు కూడా ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ఒక ప్రాంతంలో ప్రస్తుతం ప్రభుత్వ విలువ గజానికి రూ.7,500 ఉందనుకుంటే.. ప్రభుత్వం దానిని 30 శాతం పెంచితే, కొత్త ధర గజానికి రూ.9,750 అవుతుంది.
దీనివల్ల 100 గజాల స్థలాన్ని కొనే వ్యక్తి ఇదివరకు రూ.56,200 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తే సవరణ తర్వాత రూ.73,125 కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది.
గచ్చిబౌలి, రాయదుర్గం, మెహదీపట్నం, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాల్లో ప్రతిపాదిత ప్రభుత్వ ధరలు గజానికి రూ.1.10 లక్షల నుండి రూ.1.50 లక్షల వరకు ఉండేలా నివేదికలు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు అవతల, అలాగే ముచ్చర్ల సమీపంలో రాబోయే 'భారత్ ఫ్యూచర్ సిటీ' పరిసర ప్రాంతాలలో ప్రస్తుతం ధరలు గజానికి రూ.25,000 నుండి రూ.60,000 వరకు ఉన్నాయి. ఇక్కడ కూడా ధరలు పెరగనున్నాయి.
ధరలు పెరగక ముందే రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని జనాలు భారీగా తరలివస్తుండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద రద్దీ పెరిగింది. ఇందుకోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. క్యూర్ పరిధిలోకి వచ్చే పలు సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల పని వేళలను ఉదయం 9:30 నుండి సాయంత్రం 6:30 వరకు పొడిగించారు.
ఈ అదనపు సమయం వర్తించే ప్రాంతాల్లో చంపాపేట్, సరూర్‌నగర్, వనస్థలిపురం, గండిపేట్, మహేశ్వరం, ఫరూఖ్‌నగర్, షాద్‌నగర్, రంగారెడ్డి రూరల్, ఎల్‌బీ నగర్, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ ఉన్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


