Telangana Govt Schools : 27 లక్షల మంది విద్యార్థులకు బ్రాండెడ్ కిట్లు, యూనిఫాంలు - పంపిణీకి ఏర్పాట్లు సిద్ధం

రాష్ట్రంలోని పాఠశాల విద్యా వ్యవస్థలో సరికొత్త మార్పులు రానున్నాయి. రూ. 687.78 కోట్లతో ప్రభుత్వ, రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ దుస్తులు, షూస్, బెల్టులు, కాస్మొటిక్ కిట్ల పంపిణీకి సర్కార్ సిద్ధమైౌంది.

Published on: Jun 15, 2026, 07:19:27 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Government School Uniforms : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల రూపురేఖలను మార్చేందుకు, విద్యా రంగంలో సరికొత్త విప్లవాత్మక సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాబోయే కొత్త విద్యా సంవత్సరం (2026-2027) నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులందరికీ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉచిత పాఠశాల కిట్లను పంపిణీ చేయనుంది. కేవలం పుస్తకాలు, బట్టలు మాత్రమే కాకుండా.. బ్రాండెడ్ షూస్, సాక్స్, నెక్ టైలు, బెల్టులతో పాటు హాస్టల్ విద్యార్థులకు అవసరమైన బెడ్డింగ్ మెటీరియల్‌ను కూడా ఒకే గొడుగు కిందికి తెచ్చి పంపిణీ చేసేందుకు పక్కా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విప్లవం
ప్రభుత్వ బడుల్లో కార్పొరేట్ విప్లవం

ఈ బృహత్తర పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రభుత్వ పాఠశాలలతో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (KGBV), బీసీ, ఎస్సీ, ఎస్టీ, మరియు మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ప్రయోజనం చేకూరనుంది. మొత్తం 27 లక్షల మంది విద్యార్థులకు ఈ నాణ్యమైన కిట్లను అందించడానికి ప్రభుత్వం… రికార్డు స్థాయిలో రూ. 687.78 కోట్లను ఖర్చు చేస్తోంది.

నాణ్యమైన వస్త్రాలు….

గతంలో పాఠశాల యూనిఫాంల నాణ్యతపై అనేక విమర్శలు వచ్చిన నేపథ్యంలో, ఈసారి బట్టల క్వాలిటీ, స్టిచ్చింగ్ విషయంలో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికోసం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 'మఫత్‌లాల్' (Mafatlal) సంస్థ నుంచి నాణ్యమైన వస్త్రాన్ని సేకరించారు. విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలను అందించడానికి మొత్తం 2.97 కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కాగా.. అందులో 2.41 కోట్ల మీటర్ల వస్త్రాన్ని మఫత్‌లాల్ కంపెనీ సరఫరా చేస్తోంది. మిగిలిన 55.32 లక్షల మీటర్ల వస్త్రాన్ని స్థానిక చేనేత కార్మికులను ఆదుకునేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్ర చేనేత కార్మికుల సహకార సంఘం (TGSCO) నుంచి ప్రభుత్వం సేకరించింది.

  • డే స్కాలర్స్ (సాధారణ పాఠశాల విద్యార్థులు): లైట్ బ్లూ కలర్ టాప్స్, డార్క్ బ్లూ కలర్ బాటమ్స్ ధరిస్తారు.
  • రెసిడెన్షియల్ (గురుకుల పాఠశాల విద్యార్థులు): మెరూన్-చెక్స్ టాప్స్, మెరూన్ కలర్ బాటమ్స్ ధరిస్తారు.
  • బాలికల దుస్తులు: వయస్సు, తరగతులను బట్టి బాలికలకు స్కర్టులు, పంజాబీ డ్రెస్సులు, చున్నీలను అందిస్తారు.

ఈ యూనిఫాంల కుట్టుకం బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు (SHGs) అప్పగించింది. ఈ మహిళా గ్రూపులు రోజుకు 75,000 నుండి 1,00,000 యూనిఫాంలను కుట్టే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి యూనిఫాం కుట్టుకూలి కింద ప్రభుత్వం మహిళలకు రూ. 75 చెల్లిస్తోంది. 27 లక్షల మంది విద్యార్థులకు రెండేసి జతల చొప్పున దుస్తులు కుట్టడం ద్వారా రాష్ట్రంలోని మహిళా సంఘాలకు ఏకంగా రూ. 40 కోట్లకు పైగా ఉపాధి ఆదాయం లభించనుంది.

బ్రాండెడ్ షూస్, కాస్మొటిక్ కిట్లు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ఒకే తరహా ఉన్నత ప్రమాణాల కిట్లను ప్రభుత్వం అందిస్తోంది. గతంలో కేవలం బీసీ గురుకులాల విద్యార్థులకు మాత్రమే షూస్ ఇచ్చే సాంప్రదాయం ఉండేది. కానీ ఈసారి మేనేజ్‌మెంట్లతో సంబంధం లేకుండా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులందరికీ తెల్లటి షూస్, తెల్లటి సాక్స్ ఇవ్వనున్నారు. అలాగే ప్రభుత్వ, మోడల్ స్కూల్ విద్యార్థులకు నల్లటి షూస్, బెల్టులను కూడా తొలిసారిగా ఉచితంగా అందజేస్తున్నారు.

గురుకులాలు, కేజీబీవీలు, అర్బన్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండే విద్యార్థులకు మరింత సమగ్రమైన కిట్‌ను సిద్ధం చేశారు. ఈ కిట్‌లో బెల్ట్, ఐడీ కార్డ్, టై, స్కూల్ బ్యాగ్, రెండు రకాల షూస్ (బ్లాక్ & వైట్) సంబధిత సాక్స్ ఉంటాయి. వీటితో పాటు నిద్రించడానికి అవసరమైన బెడ్డింగ్ మెటీరియల్ (దుప్పట్లు, బెడ్‌షీట్లు, కార్పెట్లు), భోజనం చేయడానికి ప్లేట్, గ్లాసు, గిన్నె, సామాన్లు దాచుకోవడానికి ట్రంక్ బాక్స్, పీటీ డ్రెస్, నైట్ డ్రెస్, ట్రాక్‌సూట్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

మైనారిటీ గురుకులాల విద్యార్థులకు కూడా ట్రాక్‌సూట్లు, నైట్ వేర్ అందించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి. పాఠశాల విద్యార్థులతో పాటు జూనియర్ కాలేజీల్లో చదువుతున్న సుమారు 2,00,000 మంది ఇంటర్ విద్యార్థులకు కూడా కాలేజీ బ్యాగులు, బెల్టులు, టైలు, నల్లటి షూస్, సాక్స్ అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

గతంలో పాఠశాల విద్యాశాఖ…. వివిధ గురుకుల సొసైటీలు విడివిడిగా టెండర్లు పిలిచి దుస్తులు, వస్తువులను కొనుగోలు చేసేవి. దీనివల్ల వస్తువుల నాణ్యతలో తీవ్ర వ్యత్యాసాలు రావడమే కాకుండా కొన్ని చోట్ల భారీగా అక్రమాలు, అవినీతి సిండికేట్లు వెలుగుచూశాయి. నాసిరకం బట్టలు సరఫరా చేసి ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నారు. ఈ అక్రమాలకు శాశ్వతంగా అడ్డుకట్ట వేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఏడాది "సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్" (కేంద్రీకృత కొనుగోలు విధానం) ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా పారదర్శకమైన ఈ-టెండరింగ్ విధానం ద్వారా కొనుగోళ్లు జరిపింది.

ఈ కొనుగోళ్లలో స్థానిక ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్దపీట వేశారు. యూనిఫాం మరియు బెడ్డింగ్ ఆర్డర్లలో 25 నుండి 30 శాతాన్ని టెక్స్‌కో (TGSCO) సంస్థకు కేటాయించారు. ఇందులో 56 లక్షల మీటర్ల వస్త్రంతో పాటు, 100 శాతం దుప్పట్లు (6,49,381), 3 లక్షల బెడ్‌షీట్లు, 2.29 లక్షల కార్పెట్లు ఉన్నాయి. దీనివల్ల చేనేత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి దొరికింది. టైలు, బెల్టులు, ఐడీ కార్డుల తయారీ బాధ్యతను తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ (TGLIPC)కు అప్పగించారు. దీనివల్ల చర్మకారులు, అనుబంధ కళాకారులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కుల సరఫరా పూర్తయిందని…. వారం రోజుల్లోగా విద్యార్థులందరికీ ఈ సరికొత్త బ్రాండెడ్ కిట్లు చేరతాయని విద్యాశాఖ వెల్లడించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More