TGMS Inter Admissions 2026 : తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ అడ్మిషన్లు - రాత పరీక్ష లేకుండానే..!
TGMS Inter Admissions 2026 : తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి మార్కుల ఆధారంగా, పూర్తి రిజర్వేషన్ నిబంధనలను పాటిస్తూ ఈ సీట్లను కేటాయించనున్నారు.
TGMS Inter Admissions 2026 : రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో (మోడల్ స్కూల్స్) ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన టెన్త్ విద్యార్థులు ఈ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 25వ తేదీతో అప్లికేషన్ గడువు ముగుస్తుందని అధికారులు ప్రకటించారు.

నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించే లక్ష్యంతో 2013-14లో ప్రారంభమైన ఈ పాఠశాలలు... ప్రస్తుతం రాష్ట్రంలోని 29 జిల్లాల్లో మొత్తం 194 కేంద్రాల్లో విజయవంతంగా నడుస్తున్నాయి. ఈ కో-ఎడ్యుకేషన్ పాఠశాలల్లో అధునాతన మౌలిక వసతులు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, సబ్జెక్ట్ ల్యాబ్‌లు మరియు కంప్యూటర్ ల్యాబ్స్ వంటి అత్యుత్తమ సదుపాయాలు ఉన్నాయి. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 180 మోడల్ స్కూళ్లలో విద్యార్థినుల కోసం ప్రత్యేక హాస్టల్ వసతి కూడా అందుబాటులో ఉంది.
ఈనెల 25 చివరి తేదీ…
ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరడానికి అర్హులైన విద్యార్థులు మే 25వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgms.telangana.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు దానిని ప్రింట్ అవుట్ తీసుకుని…. దానికి ఎస్ఎస్‌సీ (SSC) మార్క్స్ మెమో, కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డ్ నకళ్లను జతచేసి సంబంధిత పాఠశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలి. దరఖాస్తు సమర్పించేటప్పుడు అభ్యర్థులు తమ వివరాలను ఎంతో జాగ్రత్తగా పూరించాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆన్‌లైన్ సబ్మిషన్ తర్వాత ఎలాంటి తప్పుల సవరణలకు అవకాశం ఉండదు.
ముఖ్యమైన తేదీలు (తాత్కాలిక షెడ్యూల్):
- ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు: మే 25, 2026 వరకు
- పాఠశాలల వారీగా అభ్యర్థుల జాబితా తయారీ: మే 26, 2026
- మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక జాబితా విడుదల: మే 27, 2026
- ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన: మే 28, 2026 నుండి మే 30, 2026 వరకు
- తరగతుల ప్రారంభం: జూన్ 1, 2026
మోడల్ స్కూళ్లలో ప్రతి ఇంటర్మీడియట్ క్లాసులో ఒక్కో గ్రూపునకు 40 మంది విద్యార్థుల చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది ఎంపీసీ (MPC), బైపీసీ (BiPC), సీఈసీ (CEC) గ్రూపులతో పాటు కీలక మార్పు చేశారు. ఇప్పటివరకు ఉన్న ఎంబీసీ/ఎంఈసీ (MEC) గ్రూపు స్థానంలో కొత్తగా ఏసీఈ (ACE - అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) గ్రూపును ప్రవేశపెడుతున్నారు. ఫైనాన్స్, బిజినెస్, మేనేజ్‌మెంట్ రంగాలలో విద్యార్థుల నైపుణ్యాలను, ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఈ కొత్త కోర్సు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ ప్రవేశాలు పూర్తిగా పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా గ్రేడ్ ఆధారంగా, రాష్ట్ర ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనలకు లోబడి జరుగుతాయి. ఎలాంటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించరు. అభ్యర్థి సదరు మండలానికి చెందిన స్థానికుడై ఉండాలి లేదా 9, 10 తరగతులను ఆ మండలంలోనే చదివి ఉండాలి.
సీట్ల కేటాయింపులో మొదట అదే మోడల్ స్కూల్లో చదివిన విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు, ఆ తర్వాత మిగిలిన లోకల్ విద్యార్థులకు, ఆ పైన ఇతర మండలాల వారికి అవకాశం కల్పిస్తారు. ఏవైనా కారణాల వల్ల మెయిన్ లిస్ట్‌లో సీట్లు ఖాళీగా ఉంటే, వాటిని భర్తీ చేయడానికి 20 శాతం అదనపు అభ్యర్థులతో ఒక వెయిటింగ్ లిస్ట్‌ను కూడా సిద్ధం చేస్తారు. ఈ నియామక జాబితాలన్నింటినీ జిల్లా కలెక్టర్ లేదా వారి ప్రతినిధి ఆమోదించిన తర్వాతే పాఠశాల నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు.'
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

