...
...
Next Story

'సిట్' విచారణకు కేటీఆర్ - వాళ్లని కూడా వదిలిపెట్టమంటూ వార్నింగ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణకు హాజరయ్యారు. అంతకంటే ముందు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… ఎన్నిసార్లు పిలిచినా వస్తానని స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరులమన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు

Published on: Jan 23, 2026, 12:15:37 IST
Advertisement

రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఈ కేసులో హరీశ్ రావు సిట్ విచారణకు హాజరుకాగా… ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ముందుకు తెలంగాణ భవన్ కు వచ్చిన ఆయన… పార్టీ నేతలను కలిశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

'సిట్' విచారణకు కేటీఆర్
'సిట్' విచారణకు కేటీఆర్

“గత పదిహేనేళ్లుగా నేను నా రాష్ట్రం కోసం పని చేశాను. మా నాయకులు మాకు ఏ బాధ్యత అప్పగించినా మేము శక్తివంచన లేకుండా నిబద్ధతతో పనిచేశాం. మేము ఎప్పుడూ టైంపాస్ రాజకీయాలు చేయలేదు. ప్రత్యర్థుల కుటుంబాలను, పిల్లలను రాజకీయాల్లోకి లాగలేదు. ప్రత్యర్థులపై అక్రమ కేసులు పెట్టి వేధించలేదు. గత రెండేళ్లుగా చూస్తుంటే ఈ రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలా మారిపోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా ఈ ప్రభుత్వానికి లేదు. ఏదో రకంగా కాలక్షేపం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రోజుకో కొత్త డ్రామా ఆడుతున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం డ్రామా, గొర్రెల స్కామ్ డ్రామా, ఫార్ములా ఈ డ్రామా, ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఆడుతున్నారు” అని కేటీఆర్ విమర్శించారు.

ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు - కేటీఆర్

“నా అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను.. నేను ఏనాడూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడలేదు. గత ఏడెనిమిది ఏళ్లుగా నా మీద తీవ్రమైన క్యారెక్టర్ అసాసినేషన్ (వ్యక్తిత్వ హననం) జరుగుతోంది. నన్ను ఏదో డ్రగ్స్ కేసుల్లోనో, హీరోయిన్లతో సంబంధాలనో ఇరికించాలని చూశారు. నన్నే కాకుండా నా కుటుంబాన్ని, పిల్లలను కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అయినా నేను ఎవరికీ భయపడలేదు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నన్ను విచారణకు పిలిచారు. నేను వెళ్తాను. నేను అడుగుతాను మా ప్రభుత్వం ఏం తప్పు చేసిందో, అసలు ఎక్కడ తప్పు జరిగిందో వాళ్ళు సమాధానం చెప్పాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

"తప్పు చేసినవాడు భయపడతాడు, తప్పు చేయనోళ్లు ఎవరికీ భయపడరు. రేవంత్ రెడ్డి కాదు ఆయన జేజమ్మ కూడా భయపడే సమస్య లేదు. ముమ్మాటికి ఒక్కటి మాత్రం పక్కా. ఈ కేసు ఇంతటితో మేము వదిలిపెట్టం. నా క్యారెక్టర్ అస్సాసినేషన్‌కు బాధ్యులైన రేవంత్ రెడ్డిని, ఆయన తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నేను కూడా వదిలిపెట్టను" అంటూ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

“మీరు ఎన్నిసార్లు పిలిచినా వస్తాం. చట్టాన్ని గౌరవించే పౌరులం, తప్పకుండా వస్తాం. మేము తప్పు చేయలేదు, చేయలేదన్న మాటనే చెప్తాం. మీరు ఎన్ని రకాల డైవర్షన్ గేమ్ లాడినా మేము మాత్రం ప్రభుత్వంపై పోరాడుతూనే ఉంటాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks