కోదాడ దళిత యువకుడి కస్టడీ మరణంపై నివేదిక కావాలి : మానవ హక్కుల కమిషన్

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన దళిత యువకుడు కర్ల రాజేశ్ కస్టడీ మరణంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నివేదిక కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని గుర్తించింది.

Published on: Dec 23, 2025, 14:24:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సూర్యాపేట జిల్లాలో దళిత యువకుడు కర్ల రాజేశ్ కస్టడీ మరణంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన ఉందని గుర్తించింది కమిషన్.. అక్రమ నిర్బంధం, కస్టడీలో హింస, యువకుడి కస్టడీ మరణంపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా పరిగణించింది.

దళిత యువకుడి మరణంపై మానవ హక్కుల కమిషన్
దళిత యువకుడి మరణంపై మానవ హక్కుల కమిషన్

మృతుడి తల్లి కర్ల లలిత, మంద కృష్ణ మాదిగతోపాటుగా మరికొందరు సమర్పించిన ఫిర్యాదుల ఆధారంగా కమిషన్ నిర్ణయం తీసుకున్నది. మృతుడిని చిల్కూరు, కోదాడ గ్రామీణ పోలీసులు చట్టవిరుద్ధంగా నిర్బంధించారని, థర్డ్ డిగ్రీ చేశారని, తప్పుడుగా ఇరికించారని, కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి నిరాకరించారని మానవ హక్కుల కమిషన్ గుర్తించినట్టుగా తెలుస్తోంది. తరువాత, ఆ వ్యక్తిని సబ్-జైలు నుండి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత నవంబర్ 16న తీవ్ర గాయాలతో మరణించాడని తెలిపింది.

నవంబర్ 4 నుంచి నవంబర్ 9 మధ్య తన కొడుకును చట్టవిరుద్ధంగా పోలీసు కస్టడీలో ఉంచి థర్డ్ డిగ్రీ పద్ధతులను ప్రయోగించి శారీరకంగా హింసించారని యువకుడి తల్లి కర్ల లలిత ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తప్పుడు క్రిమినల్ కేసులో ఇరికించి నవంబర్ 10న జ్యుడీషియల్ కస్టడీకి తరలించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నవంబర్ 10న తన కొడుకు ఆరోగ్యం బాగాలేదని హుజూర్‌నగర్ సబ్-జైలు సిబ్బంది నుండి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, అక్కడికి వెళ్లినప్పుడు తన కొడుకు తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నాడని లలిత తెలిపారు. నవంబర్ 14న తన కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో సూర్యాపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, అక్కడ రాజేశ్ నవంబర్ 16న మరణించాడని మానవ హక్కుల కమిషన్‌కు వివరించారు తల్లి కర్ల లలిత.

వీటన్నింటినీ మానవ హక్కుల కమిషన్ సీరియస్‌గా తీసుకుంది. ఈ కేసును గతంలో వచ్చిన ఫిర్యాదుతో కలిపి, వివరణాత్మక నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై తదుపరి పరిశీలన కోసం జనవరి 12వ తేదీని నిర్ణయించింది.

మరోవైపు దళిత యువకుడి కస్టడీ మరణంపై అతని తల్లి దాఖలు చేసిన ఫిర్యాదుపై, తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి విచారణ జరుగుతోందని, చర్యలు తీసుకుంటామని ఇటీవల చెప్పారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More