...
...
Next Story

ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్లకు ఇంటర్ బోర్డు యూనిక్ ఐడీలు.. ఎక్కడకు వెళ్లినా ఇదొక్కటే!

ప్రైవేట్ కాలేజీల్లో లెక్చరర్లకు ఇంటర్ బోర్డు యూనిక్ ఐడీ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇక ఎక్కడకు వెళ్లినా.. ఒకే రకమైన ఐడీతో లెక్చరర్ల సర్వీస్ హిస్టరీని ఈజీగా ట్రాక్ చేయవచ్చు.

Published on: Feb 03, 2026 03:07 PM IST
Advertisement

ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టడానికి, ఫేక్ లెక్చరర్లను తగ్గించడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు లెక్చరర్లకు ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య(యూనిక్ ఐడీ) వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఒక లెక్చరర్ ఏ కాలేజీకి వెళ్లినా ఒకటే శాశ్వత ఐడీ ఉంటుంది. ఇదే ఎక్కడకు వెళ్లినా వారి వివరాలను చెబుతుందన్నమాట.

తెలంగాణ ఇంటర్ బోర్డు
తెలంగాణ ఇంటర్ బోర్డు

కొత్త వ్యవస్థ కింద ప్రతి లెక్చరర్‌కు ఒకే శాశ్వత ప్రత్యేక ఐడీని కేటాయిస్తారు. ఒక లెక్చరర్ ఒక కళాశాల నుండి మరొక కళాశాలకు మారినప్పటికీ అదే ఐడీ కొనసాగుతుంది. ఆధార్ కార్డు ఎలానో.. ఈ ఐడీ కూడా లెక్చరర్లు ఉద్యోగం చేయడానికి ఉపయోగపడనుంది. దీని వలన ఇంటర్ బోర్డు.. లెక్చరర్ పూర్తి సర్వీస్ హిస్టరీని ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

రికార్డులను తారుమారు చేయడం ద్వారా రెండు లేదా మూడు కళాశాలల్లో ఒకేసారి పనిచేస్తున్నారు కొంతమంది లెక్చరర్లు. అలాంటి వారిని యూనిక్ ఐడీ ద్వారా ఈజీగా గుర్తించవచ్చని ఇంటర్ బోర్డు భావిస్తోంది. ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఈ ప్రత్యేక ఐడీలు కీలక పాత్ర పోషిస్తాయి.

రాష్ట్రవ్యాప్తంగా 41 వేల మందికి పైగా బోధనా సిబ్బందికి బోర్డు ఇప్పటికే ప్రత్యేక ఐడీ నెంబర్లు కేటాయించింది. ఈ వ్యవస్థ నకిలీ అధ్యాపకులను గుర్తించడంలో, ఫేక్ వ్యక్తులను నిరోధించడంలో సహాయపడుతుంది. ఎందుకంటే ఒక ఐడీని ఒకేసారి ఒక కళాశాలకు మాత్రమే లింక్ చేయవచ్చు.

కార్పొరేట్ కళాశాలల్లోని అనేక మంది లెక్చరర్లు ఒకేసారి పలు కాలేజీల్లో పనిచేస్తుంటారు. ఈ విషయం బోర్డు దృష్టికి వచ్చింది. ప్రధానంగా భాష లెక్చరర్లు, గణితం, భౌతిక శాస్త్రం వంటి అధిక డిమాండ్ ఉన్న సబ్జెక్టుల బోధించేవారు ఒకేసారి పలు కాలేజీల్లో బోధిస్తున్నారు. చాలా సందర్భాలలో ఒకే లెక్చరర్‌ను వేర్వేరు వ్యక్తులలాగా చూపించడానికి పేర్లలో చిన్న మార్పులు చేస్తుంటారు.

ఇంటర్మీడియట్ విద్యలో పారదర్శకతను పెంపొందించడానికి ఈ యూనిక్ ఐడీ వ్యవస్థను ప్రవేశపెట్టింది ఇంటర్ బోర్డు. నిబంధనల ప్రకారం కళాశాలలకు ఎంతమంది అవసరమో.. అంతమంది అధ్యాపకులు ఉన్నారో లేదో ధృవీకరించడం ఈ వ్యవస్థ సులభతరం చేస్తుంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe