...
...
Next Story

సామాన్యుడి బడ్జెట్‌పై ఉల్లి ధర ఎఫెక్ట్.. కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న రేట్.. కిలో ఎంత?

Onion Price : తెలంగాణలో సామాన్యుడి జేబుపై ఉల్లి ధరలు ప్రభావం చూపిస్తున్నాయి. కిలో ముప్పై, నలభై ఉన్న ధరలు సెంచరీకి దగ్గరగా వెళ్తున్నాయి. దీంతో కూరలో ఉల్లిపాయ వేయాలంటే భయపడే పరిస్థితి వచ్చింది.

Published on: Sep 9, 2026, 15:51:13 IST
Advertisement

తెలంగాణ అంతటా ఉల్లిపాయల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. అనేక మార్కెట్లలో మెున్నటి దాకా ముప్పై నలభై పలికిన ధరలు ఒకేసారిగా పెరిగాయి. ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.60కి నుంచి రూ.80కి మధ్యలో పలుకుతున్నాయి. మరికొన్ని రోజుల్లో సెంచరీకి చేరువ అవుతాయి. కొన్ని రోజుల క్రితం కిలో రూ.40 చొప్పున అమ్ముడైన ఉల్లిపాయల ధరలు ఇప్పుడు మరింత పెరగడంతో, సామాన్యుల ఇంటి బడ్జెట్‌పై భారం పడుతోంది.

పెరిగిన ఉల్లిపాయ ధరలు
పెరిగిన ఉల్లిపాయ ధరలు

మహారాష్ట్రలోని నాసిక్ ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాలలో ఒకటి, తెలంగాణకు కీలక సరఫరాదారుగా ఉంది. మహారాష్ట్ర నుండి ఉల్లిపాయలు పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మార్కెట్లకు వస్తుంటాయి. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు ప్రాంతం నుండి కూడా తెలంగాణకు ఉల్లిపాయలు సరఫరా అవుతాయి.

కొత్త పంట రావడంలో జాప్యం, ప్రధాన ఉల్లి సాగు ప్రాంతాలలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా సరఫరా తగ్గి, ధరలు భారీగా పెరిగాయని వ్యాపారులు పేర్కొన్నారు. గతంలో వినియోగదారులు రూ.100కు దాదాపు 3 కిలోల ఉల్లిపాయలను కొనుగోలు చేసేవారు. కానీ ధరల పెరుగుదల కారణంగా ఇప్పుడు ఆ పరిమాణం గణనీయంగా తగ్గిపోయింది.

ఈ పరిస్థితి హోల్‌సేల్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. హైదరాబాద్‌లోని మలక్‌పేట ఉల్లి మార్కెట్‌లో గతంలో రోజుకు సుమారు 25,000 బస్తాల వరకు వచ్చే సరుకు, ఇప్పుడు 15,000 నుండి 17,000 బస్తాలకు తగ్గిందని వ్యాపారులు తెలిపారు.

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు ఉల్లి పంటను దెబ్బతీశాయి. కొన్ని పొలాలు నీట మునిగాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో తగినంత వర్షపాతం లేకపోవడం కూడా పంట ఉత్పత్తిపై ప్రభావం చూపింది. ఈ కారణాలన్నీ సరఫరా కొరతకు దారితీశాయని వ్యాపారులు చెప్పారు.

ఖరీఫ్ ఉల్లి పంట ఇంకా మార్కెట్లకు తగినంత పరిమాణంలో రాలేదని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో కొత్త సరకు రాక పెరిగే వరకు ధరలు అధికంగానే ఉండే అవకాశం ఉంది. లేదా మరింత పెరగవచ్చు. డిసెంబర్ నాటికి కొత్త పంట పెద్ద మొత్తంలో మార్కెట్‌కు వచ్చే అవకాశం ఉన్నందున, అప్పుడు పరిస్థితి మెరుగుపడవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఉల్లి సరఫరా కోసం మహారాష్ట్రపై ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా అక్కడ పండించే ఉల్లిపాయల నాణ్యత, లభ్యత దీనికి కారణం. దీంతో మహారాష్ట్ర నుండి సరఫరాలో ఏ చిన్న అంతరాయం వచ్చినా.. తెలంగాణలో ఉల్లి మార్కెట్‌పై ఎఫెక్ట్ పడుతోంది. ఇప్పుడు పెరిగిన ధరలతో సామాన్యుడి బడ్జెట్‌పై ఎఫెక్ట్ చూపిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks