...
...
Next Story

కృష్ణా, గోదావరి జలాల్లో రాజీపడే ప్రసక్తే లేదు - సీఎం రేవంత్ రెడ్డి

2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ. 4.18 లక్షలు దాటిందని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జాతీయ జిడిపిలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.కృష్ణా, గోదావరి జలాల్లో రాజీపడేది లేదని స్పష్టం చేశారు.

Published on: Aug 15, 2026, 15:06:41 IST
Advertisement

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా రూ. 4,18,931కి చేరిందని వెల్లడించారు. ఈ తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే దాదాపు 91 శాతం అధికంగా ఉందని వివరించారు. గోల్కొండ కోటలో శనివారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

దేశ జనాభాలో తెలంగాణ వాటా కేవలం 2.50 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, జాతీయ స్థూల జాతీయోత్పత్తి (GDP)లో రాష్ట్రం ఏకంగా 5 శాతం భాగస్వామ్యాన్ని కలిగి ఉందని ఆయన గుర్తుచేశారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యాన్ని 10 శాతానికి పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

రాష్ట్ర సమగ్ర వికాసం కోసం తమ ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. "గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం సంక్షేమంతో నాలుగు కోట్ల ప్రజలకు భరోసా ఇచ్చింది. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేసింది. సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించింది. భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేసింది. ఈ విజయాల పునాదిపై తెలంగాణను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లే బృహత్తర సంకల్పమే తెలంగాణ రైజింగ్-2047," అని ఆయన ప్రకటించారు.

రాజీపడే ప్రసక్తే లేదు - సీఎం రేవంత్

నీటి పారుదల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ… "కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా సాధించే విషయంలో రాజీపడేది లేదు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యక్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తాం" అని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు. పేదల ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి భరోసా ఇచ్చేలా సన్నబియ్యం పంపిణీని విప్లవాత్మక పథకంగా అమలు చేస్తున్నామన్నారు.

విద్యారంగంలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయని, కేంద్రం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి మెరుగుపడిందని సీఎం తెలిపారు.

యువతకు ఉపాధి కల్పనపై మాట్లాడుతూ…. "ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకుపైగా ఉద్యోగ నియామకాలను పూర్తి చేశాం. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, మెగా డీఎస్సీ నియామకాలు విజయవంతంగా నిర్వహించి నియామక పత్రాలు అందించాం. టీజీపీఎస్‌సి ద్వారా 456 పోస్టులు, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 7437 పోస్టుల భర్తీకి కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చాం" అని వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks